Ex-gratia To HDFC Bank Employees: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏకంగా రూ. 1500 కోట్ల పరిహారం (ex-gratia) ఇవ్వాలని నిర్ణయించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ MD & CEO శశిధర్ జగదీశన్ (Sashidhar Jagdishan) ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ వన్‌టైమ్ పేమెంట్ యువ ఉద్యోగులను ప్రోత్సహిస్తుందని చెప్పారు. 


విలీనం తర్వాత సిబ్బంది పనితీరు అమోఘం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనం తర్వాత బ్యాంక్‌ సిబ్బంది పనితీరు చాలా బాగుందని CEO శశిధర్ జగదీశన్ మెచ్చుకున్నారు. వారి పనితీరుకు తగ్గ ప్రతిఫలం కచ్చితంగా దక్కాలని అన్నారు. ఆట్రిషన్ రేట్‌ (సిబ్బంది వలసల శాతం) కూడా నియంత్రణలో ఉన్నట్లు చెప్పారు. బ్యాంక్‌ ఉద్యోగులు చేసిన కృషికి, బయటకు వెళ్లకుండా బ్యాంకుతోనే కొనసాగినందుకు గుర్తింపుగా రూ. 1500 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జగదీశన్ వివరించారు. Q4లో మంచి రిజల్ట్స్‌ సాధించిన బ్యాంక్‌, ఆ సంతోషాన్ని ఉద్యోగులతో కలిసి పంచుకుంటూ ఎక్స్‌గ్రేసియా నిర్ణయం తీసుకుంది. 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్చి త్రైమాసికం ఫలితాలు
2023-24 మార్చి త్రైమాసికం (Q4 FY24) ఫలితాలను హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ శనివారం నాడు ప్రకటించింది. 2024 జనవరి-మార్చి త్రైమాసికంలో, స్వతంత్ర ప్రాతిపదికన (స్టాండలోన్‌) ఈ బ్యాంక్ రూ. 16,511 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. Q3లో (2023 అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికం) ఈ మొత్తం రూ. 16,373 కోట్లుగా ఉంది, Q4లో స్వల్పంగా 0.84 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 9.6 శాతం జంప్‌తో రూ. 89,693.90 కోట్లుగా నమోదైంది. Q3లో ఇది రూ. 81,719.65 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఈ బ్యాంక్‌ రూ. 64,060 కోట్ల నికర లాభాన్ని మిగిల్చుకుంది.


జనవరి-మార్చి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) 24.5 శాతం పెరిగి రూ. 29,007 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 0.04 శాతం పెరిగి 3.44 శాతంగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తుల (GNPA) నిష్పత్తి 1.26 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గితే, నికర నిరర్థక ఆస్తులు ‍(NNPA)‌ 0.31 శాతం నుంచి 0.33 శాతానికి పెరిగాయి. మొత్తం కేటాయింపులు (Provisions) రూ.13,510 కోట్లు. 2024 మార్చి చివరి నాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు రూ. 23.80 లక్షల కోట్లకు చేరాయి, ఇది 26.4 శాతం వృద్ధి. బ్యాంక్ ఇచ్చిన మొత్తం లోన్లు 55.4 శాతం పెరిగి రూ. 24.8 లక్షల కోట్లకు చేరాయి. 


Q4లో దాదాపు 650 కొత్త శాఖలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రారంభించింది, మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 8,738 కు చేరింది. ఈ నంబర్‌ను 12,000కు చేర్చడం లక్ష్యమని బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.


ఒక్కో షేర్‌కు రూ.19.50 డివిడెండ్‌
త్రైమాసికం ఫలితాలతో పాటే తన పెట్టుబడిదార్లు, షేర్‌హోల్డర్లకు డివిడెండ్‌ను కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 19.50 డివిడెండ్‌ను ఈ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇస్తోంది.


గత సెషన్‌లో (శుక్రవారం, 19 ఏప్రిల్‌ 2024) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 2.46% పెరిగి రూ. 1,531.30 వద్ద క్లోజ్‌ అయ్యాయి. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: అంచనాలను మించిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు - ఖజానాకు కాసుల కళ