దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ 2021-22 ఏడాదికి గాను డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.15.50 డివిడెండ్‌గా ఇస్తామని వెల్లడించింది. షేరు ఫేస్‌వాల్యూ రూ.1 ప్రకారం చూసుకుంటే 1550 శాతం డివిడెండ్‌ ఇస్తున్నట్టు లెక్క! పైగా 11 ఏళ్లలో ఇంత మొత్తంలో ఇవ్వడం ఇదే తొలిసారి.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శనివారం మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ వద్ద ఒక ఫైలింగ్‌ చేసింది. 2021-22 ఏడాదికి గాను రూ.1 ఫేస్‌వాల్యూ కలిగిన షేరుకు రూ.15.50 లేదా 1550 శాతం డివిడెండ్‌ను రికమెండ్‌ చేస్తున్నామని వెల్లడించింది. 2011, జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ అత్యధికంగా రూ.16.50 డివిడెండ్‌ను ఇవ్వడం గమనార్హం. వాస్తవంగా 2001, ఏప్రిల్‌ 20 తర్వాత రెండోసారి అత్యధికంగా ఇచ్చిన డివిడెండ్‌ ఇదే.


2001, ఏప్రిల్‌ 20 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొత్తంగా 22 సార్లు డివిడెండ్‌ను ప్రకటించింది. అందులో 21సార్లు ఫైనల్‌ డివిడెండ్‌గా ఇచ్చింది. మిగతావి స్పెషల్‌ డివిడెండ్‌. 2019, ఆగస్టులో బ్యాంకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.5 డివిడెండ్‌గా ఇచ్చింది. చివరి 12 నెలల్లో రూ.6.50గా ప్రకటించింది. 2021 నుంచి 2011 వరకు చూసుకుంటే వరుసగా రూ.6.5, 5 (2019లో స్పెషల్‌),  15, 13, 11, 9.5, 8, 6.85, 5.5, 4.3, 16.5 ఇచ్చింది.


ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ షేరు ధర రూ.1335గా ఉంది. దీంతో కంపెనీ డివిడెండ్‌ ఈల్డ్‌ 0.48 గా ఉండబోతోంది. 2020లో బ్యాంకు డివిడెండ్‌ ప్రకటించలేదు. కరోనా మహమ్మారి రావడం, వ్యాపారం సజావుగా సాగకపోవడమే ఇందుకు కారణం. అంతకుముందు 2001, 2002లోనూ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రకటించిన రూ.15.50 డివిడెండ్‌కు ఏజీఎంలో షేర్‌హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంది. మే 13ను రికార్డు డేట్‌గా ఫిక్స్‌ చేశారు. ఆ తేదీకి ముందు కొనుగోలు చేసిన వారికి డివిడెండ్‌ లభిస్తుంది.


HDFC Bank Results: త్రైమాసిక ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదరగొట్టింది. వార్షిక ప్రాతిపదికన 22.8 శాతం నికర లాభాన్ని నమోదు చేసింది. జనవరి-మార్చి క్వార్టర్లో రూ.10,055 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.8,186 కోట్లు కావడం గమనార్హం. ప్రావిజన్స్‌ దాదాపుగా రూ.1300 కోట్లకు తగ్గడమే ఇందుకు కారణం.


2020-21 ఏడాది జనవరి-మార్చిలోని రూ.4693 కోట్లతో పోలిస్తే గతేడాది నాలుగో క్వార్టర్లో ప్రావిజన్స్‌ రూ.3312 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా రుణ నష్టాల ప్రావిజన్స్‌ రూ.1778 కోట్లు, సాధారణ ఇతర ప్రావిజన్స్‌ రూ.1534 కోట్లుగా ఉంది. 'ప్రస్తుత క్వార్టర్‌లో కంటిజెన్స్‌తో సహా మొత్తం ప్రావిజన్స్‌ రూ.1000 కోట్లు కలిసే ఉన్నాయి' అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.


కంపెనీ క్రెడిట్ కాస్ట్‌ రేషియో 0.96 శాతంగా ఉంది. 2021, డిసెంబర్‌ 31 ముగిసిన త్రైమాసికంలో ఇది 0.94 శాతంగా ఉండేది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 1.64 శాతంగా ఉండేది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (నెట్‌ ఇంట్రెస్ట్‌ ఇన్‌కం) 10.2 శాతం పెరిగి రూ.18,872 కోట్లుగా ఉంది. అడ్వానెన్స్‌ గ్రోత్‌ 20.8 శాతం ఉండటమే ఇందుకు కారణం. వివిధ ప్రొడక్టులు, సెగ్మెంట్లలో రుణాల వృద్ధి పెరిగిందని కంపెనీ తెలిసింది. రిటైల్‌ అడ్వాన్సులు 15.2 శాతం, కమర్షియల్‌, రూరల్‌ బ్యాంకింగ్‌ రుణాల్లో 30.4 శాతం, హోల్‌సేల్‌ లోన్స్‌ గ్రోత్‌ 17,4 శాతంగా ఉంది.