Hurun India Philanthropy List 2023: ప్రముఖ ఐటీ కంపెనీ HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ శివ్ నాడార్, వరుసగా రెండో ఏడాది కూడా దేశంలోనే అతి పెద్ద దాన కర్ణుడిగా నిలిచారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, శివ నాడార్ 2,042 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం, 2021-22తో పోలిస్తే ఇది 76 శాతం ఎక్కువ కావడం విశేషం. 2021-22లో శివ్‌ నాడార్‌ రూ.1161 కోట్లను దానధర్మాలకు వినియోగించారు.


ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2023 ‍‌(EdelGive Hurun India Philanthropy List 2023) ప్రకారం, రూ.2042 కోట్లు విరాళం ఇచ్చిన శివ్ నాడార్, దేశంలోనే అత్యంత పెద్ద మనసున్న పరోపకారిగా అవతరించారు. ఈ మొత్తాన్ని రోజుల్లోకి మారిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయన ప్రతి రోజూ సగటున 5.6 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. శివ్‌ నాడార్‌ సంపద విలువ (Shiv Nadar Net Worth) రూ.2.28 లక్షల కోట్లుగా ఎడెల్‌గివ్ హురున్ ఇండియా వెల్లడించింది.


టాప్‌-10 దానగుణ సంపన్నులు
శివ నాడార్ తర్వాత, దానగుణంలో, విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉన్నారు. 2022-23లో ఆయన మొత్తం రూ. 1774 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 267 శాతం ఎక్కువ.


ఆసియాలోనే అతి పెద్ద సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, విరాళాల పరంగా మూడో స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా రూ. 376 కోట్లను ఆయన వెచ్చించారు. 


రూ.287 కోట్లతో కుమార మంగళం బిర్లా నాలుగో స్థానంలో; రూ.285 కోట్లతో గౌతమ్‌ అదానీ ఐదో ప్లేస్‌లో ఉన్నారు. హురున్‌ ఇండియా ఫిలాంత్రఫి లిస్ట్‌లో గత ఏడాది ఏడో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ.. ఈసారి రెండు స్థానాలు మెరుగుపడ్డారు.


రూ.264 కోట్లతో బజాజ్‌ కుటుంబం ఆరో స్థానంలో; రూ.241 కోట్లతో అనిల్‌ అగర్వాల్‌ ఏడో స్థానంలో; రూ.189 కోట్లతో నందన్‌ నీలేఖని ఎయిత్‌ ప్లేస్‌లో; రూ.179 కోట్లతో పూనావాలా ఫ్యామిలీ 9వ ర్యాంక్‌లో; రూ.170 కోట్లతో రోహిణి నీలేఖని 10వ స్థానంలో ఉన్నారు. 


37 సంవత్సరాల వయస్సున్న, జీరోధాకు చెందిన నిఖిల్ కామత్ అత్యంత పిన్న వయస్కుడైన దాతగా నిలిచారు. 112 కోట్ల రూపాయల విరాళంగా అందించిన ఆయన లిస్ట్‌లో 12వ స్థానంలో ఉన్నారు.  


దేశంలోని మహిళా దాతలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే రోహిణి నీలేఖని తొలి స్థానంలో ఉన్నారు. ఈ లిస్ట్‌లోని ఇతర మహిళల పేర్లను పరిశీలిస్తే... అను అగా, లీనా గాంధీ తలో రూ.23 కోట్లు విరాళంగా అందించారు, వరుసగా ఇద్దరూ 40, 41 స్థానాల్లో ఉన్నారు. ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2023 ‍‌లిస్ట్‌లో మొత్తం దాతల్లో ఏడుగురు మహిళలు.


రూ.100 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్లు 14 మంది
2022-23 ఆర్థిక సంవత్సరంలో 14 మంది భారతీయులు రూ.100 కోట్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారు, అంతకుముందు సంవత్సరంలో కేవలం 6 మాత్రమే రూ.100 కోట్లు దాటారు. 12 మంది రూ.50 కోట్లు పైబడి; 47 మంది రూ.20 కోట్లు దాటి దానధర్మాలకు ఖర్చు చేశారు.


2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 119 మంది పారిశ్రామికవేత్తలు రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన మొత్తం డబ్బును కలిపితే రూ.8445 కోట్లు అవుతుంది. ఈ మొత్తం 2021-22 కంటే 59 శాతం ఎక్కువ. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial