GST 2.0 Latest News: GST 2.0 కొత్త రేట్లు ఈరోజు (సెప్టెంబర్ 22) నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. దీనివల్ల రోజువారీగా ఉపయోగించే పలు రకాల వస్తువులు చౌకగా మారతాయి. ఇది మధ్యతరగతి ప్రజలకు భారీగా ఉపశమనం కలిగించింది. GST సంస్కరణలు సోమవారం నుండి అమలులోకి రావడానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, "నెక్స్ట్ జనరేషన్ GST సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. సోమవారం నుండి GST ఆదా ఉత్సవ్ ప్రారంభమవుతుంది, ఇది దేశంలోని కుటుంబాలు, వర్తకులు, రైతులు, వ్యాపారులకు పొదుపును ప్రోత్సహిస్తుంది. భారతదేశ అభివృద్ధి యాత్రకు ఊతం ఇస్తుంది" అన్నారు. కొత్త పన్ను ద్వారా అవసరమైన వస్తువులను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్రం ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి జీఎస్టీ కొత్త స్లాబ్స్ సంస్కరణలు తీసుకొచ్చాయి. లగ్జరీ, పొగాకు ఉత్పత్తులపై పన్ను భారం కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కానీ కొన్ని వస్తువులపై నేటి నుంచి ధరలు పెరగడం లేదు.
నేటి నుంచి ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి
GST 2.0 సంస్కరణల ప్రకారం.. ప్రభుత్వం లగ్జరీ వస్తువులు, కొన్ని రకాల వాహనాలపై 40 శాతం GST విధించింది. సిన్ ప్రాడక్ట్స్ కింద సిగరెట్లు, గుట్కా, పొగాకు, పాన్ మసాలా, చక్కెర కలిపిన కార్బోనేటేడ్ పానీయాలు లాంటివి వస్తాయి, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. దీనితో పాటు, ఆర్థికంగా నష్టం కలిగించే కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనీ గేమింగ్, జూదం లాంటివి. వీటి వినియోగంపై ఇప్పుడు 40 శాతం GST విధిస్తారు. అలాగే, పెద్ద కార్లు, ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్లు, యాచ్‌ల వంటి లగ్జరీ వస్తువులకు GST 2.0 కింద ఎటువంటి ఉపశమనం లభించలేదు. అంతేకాకుండా, పెట్రోల్ కార్లు (1200cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం), డీజిల్ కార్లు (1500cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం,), బైక్‌లు (350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం) కూడా అధిక జీఎస్టీ కేటగిరీలో చేర్చారు.
ఆ వస్తువుల జాబితా ఇదే
పొగాకు ఉత్పత్తులు
- సిగరెట్లు
- సిగార్లు
- పాన్ మసాలా
- గుట్కా
- నమలడానికి ఉపయోగించే పొగాకు
- ప్రాసెస్ చేయని పొగాకు
- జర్దా
ఆహార పదార్థాలు
- ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్
- కార్బోనేటేడ్ పానీయాలు
- ఫ్లేవర్డ్ షుగరీ డ్రింక్స్
- చక్కెర కలిపిన కూల్ డ్రింక్స్
మరింత జాగ్రత్తగా ఉండాలి
ఈరోజు నుండి GST 2.0 అమలులోకి వచ్చింది. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్యాక్ చేసిన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు సెప్టెంబర్ 22కి ముందు చేసిన ఉత్పత్తులపై పాత, సవరించిన MRP రెండూ కనిపించవచ్చు. అయితే, కొంతమంది దుకాణదారులు ఇప్పటికీ పాత ధరలను వసూలు చసే అవకాశం ఉంది. కనుక వస్తువులను జాగ్రత్తగా చూసి బిల్లును చెల్లించాలని అధికారులు సూచించారు. మీరు GSTకి సంబంధించిన ఫిర్యాదులను నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (https://consumerhelpline.gov.in) కు సంబంధించిన ఇన్‌గ్రామ్ ( ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం) పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.