GST Collections In May 2023: మన దేశంలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు తారస్థాయిలో ఉన్నాయి, వరుసగా మూడో నెల కూడా రూ. 1.50 లక్షల కోట్ల మార్క్ దాటాయి.
ఈ ఏడాది మే నెలలో వచ్చిన GST వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మే నెలలో, వస్తు, సేవల పన్నుల రూపంలో రూ. 1,57,090 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆర్జించింది. సరిగ్గా ఏడాది క్రితం, 2022 మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1,40,885 లక్షల కోట్లు. దీనితో పోలిస్తే (సంవత్సరం ప్రాదిపదికన), ప్రస్తుతం GST ఆదాయం 12 శాతం పెరిగింది. మరోవైపు, ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చి చూస్తే GST కలెక్షన్ తగ్గింది. 2023 ఏప్రిల్ నెలలో ప్రభుత్వానికి రూ. 1.87 లక్షల కోట్ల GST ఆదాయం అందింది.
ట్విట్టర్ ద్వారా జీఎస్‌టీ గణాంకాలు వెల్లడి
2023 మే జీఎస్టీ వసూలు గణాంకాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసింది.
జీఎస్‌టీలో కేంద్ర, రాష్ట్ర వాటాలు
2023 మే నెల జీఎస్టీ మొత్తం కలెక్షన్ రూ. 1,57,090 లక్షల కోట్లలో, CGST (కేంద్ర జీఎస్‌టీ) రూపంలో రూ. 28,411 కోట్లు, SGST (రాష్ట్ర జీఎస్‌టీ) రూపంలో రూ. 35,800 కోట్లు వచ్చాయి. సమ్మిళిత GST రూ. 81,363 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలైన రూ. 41,722 కోట్లు కలిపి), సెస్ రూ.11,489 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలైన రూ. 1,057 కోట్లు కలిపి) కూడా మే నెల మొత్తం GSTలో కలిసి ఉన్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. పన్ను మినహాయింపుల తర్వాత, మే నెలలో కేంద్ర జీఎస్టీ రూ. 63,780 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 65,597 కోట్లు అవుతుంది. గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగుతున్నాయి. దేశంలో పురోగమిస్తున్న వస్తు, సేవల డేటాను ప్రస్తుత GST వసూళ్లు ప్రతిబింబిస్తున్నాయని టాక్స్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో సీజీఎస్టీ రూ. 38,400 కోట్లుగా, ఎస్‌జీఎస్టీ నంబర్ రూ. 47,400 కోట్లుగా నమోదైంది.
నెలవారీ జీఎస్టీ రాబడి గురించి చెప్పకుంటే, జీఎస్టీ వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా 14వ నెల. 2017 జులై 1న జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత, నెలవారీ వసూళ్ల మొత్తం రూ. 1.5 లక్షల కోట్లు దాటడం ఇది ఐదోసారి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ. 1.87 లక్షల కోట్ల GST ఆదాయమే ఇప్పటి వరకు ఉన్న మంత్లీ రికార్డ్. అంతకుముందు మార్చి నెలలో రూ. 1.60 లక్షల కోట్లు GST రూపంలో వసూలయ్యాయి.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: మరోమారు తాతయిన ముకేష్ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్-శ్లోక