GST Collection Update: పండుగ కొనుగోళ్లతో రికార్డ్‌ స్థాయికి జీఎస్‌టీ వసూళ్లు, ఒక్క నెలలో లక్షన్నర కోట్ల పన్నులు కట్టాం

2017 జులైలో పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత, ఇది రెండో అత్యధిక నెలవారీ వసూళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో GST వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Continues below advertisement

GST Collection Update: ఈ ఏడాది అక్టోబర్‌లో, వస్తు, సేవల పన్ను (Goods and Services Tax - GST) వసూళ్లు రికార్డ్‌ సృష్టించాయి. దాదాపు రూ. 1.52 లక్షల కోట్లను (రూ.1.52 ట్రిలియన్లు) చేరాయి. కచ్చితంగా చెప్పాలంటే రూ. 1,51,718 కోట్లు వసూలయ్యాయి. 2017 జులైలో పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత, ఇది రెండో అత్యధిక నెలవారీ వసూళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో GST వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Continues below advertisement

అక్టోబర్‌ నెలలో పండుగ సీజన్‌ పీక్‌ స్టేజ్‌లో ఉంది. దసరా, దీపావళి అదే నెలలో వచ్చాయి. పండుగ సీజన్‌ కాబట్టి చెప్పుల నుంచి కార్ల వరకు ప్రతి వస్తువు మీద కంపెనీలు డిస్కౌంట్లు పెట్టాయి. అమెజాన్‌, ఫ్లిక్‌కార్ట్‌, మింత్రా వంటి ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ కూడా కళ్లు తిరిగే ఆఫర్లు అందించాయి. ఖాతాలో పడ్డ జీతాలు, పండుగ బోనస్‌లు, క్రెడిట్‌ కార్డులు పట్టుకుని జనం తెగ షాపింగ్‌ చేశారు. ఒక్క నెలలోనే లక్షల కోట్ల రూపాయలను విచ్చవిలడిగా ఖర్చు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్నులు, పారిశ్రామిక రంగం కట్టిన టాక్స్‌లు కూడా దీనికి తోడయ్యాయి. ఇవన్నీ కలిసిన మొత్తం 'సెకండ్‌ హయ్యస్ట్‌ ఎవర్‌'గా నిలిచింది. 2021 అక్టోబర్‌తో పోలిస్తే, 2022 అక్టోబర్‌లో GST వసూళ్లు 16.6 శాతం పెరిగాయి.

అక్టోబర్‌లో, మొత్తం గ్రాస్‌ GSTలో... సెంట్రల్‌ GST (CGST) రూ. 26,039 కోట్లు, స్టేట్‌ GST (SGST) రూ. 33,396 కోట్లు, ఇంటిగ్రేటెడ్ GST (IGST) రూ. 81,778 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 37,297 కోట్లతో కలిపి), సెస్ రూ. 10,505 కోట్లుగా (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 825 కోట్లతో సహా) లెక్క తేలాయి. మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ డేటాను విడుదల చేసింది. 

వరుసగా 8వ నెల
నెలవారీ GST ఆదాయం రూ. 1.4 లక్షల కోట్లను దాటడం ఇది తొమ్మిదో నెల, వరుసగా ఎనిమిదో నెల. రెండుసార్లు రూ.1.50 లక్షల కోట్లను దాటాయి.

2022 ఆగస్టులోని 77 మిలియన్ల (7.7 కోట్లు) ఈ-వే బిల్లులతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 83 మిలియన్ల ‍‌(8.3 కోట్లు) ఈ-వే బిల్లులు జెనరేట్‌ అయ్యాయి.

FY23 బడ్జెట్ అంచనాల కంటే రూ. 1.3-1.4 లక్షల కోట్లు ఎక్కువగా CGST వసూళ్లు ఉండవచ్చన్నది ఆర్థికవేత్తల అంచనా.

కాంపన్సేషన్‌ సెస్‌ను మినహాయించి, రూ. 6.6 లక్షల కోట్ల CGST లక్ష్యాన్ని బడ్జెట్-2022లో నిర్ధేశించారు.

సాధారణ సెటిల్‌మెంట్‌, తాత్కాలిక సెటిల్‌మెంట్‌ తర్వాత, అక్టోబర్‌లో CGST ఆదాయం రూ. 74,665 కోట్లు, SGST రూ. 77,279 కోట్లుగా తేలింది.

ఈ రేంజ్‌లో పన్ను వసూళ్లు వచ్చాయంటే.. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు ఆదాయం గణనీయంగా పెరిగిందని అర్ధం.

తెలుగు రాష్ట్రాల్లో..
అక్టోబర్‌ నెల GST వసూళ్లు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భారీ మొత్తాన్ని తెచ్చి పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ ఖజానాకు రూ. 3,579 కోట్లు; తెలంగాణ ఖజానాకు రూ. 4,284 కోట్లు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే, ఈసారి ఆంధ్రప్రదేశ్‌ GST ఆదాయం 25%, తెలంగాణ GST ఆదాయం 11% పెరిగింది.

Continues below advertisement