Semiconductor Investment: భారతదేశాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తి కేంద్రంగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మన కంటికి కూడా సరిగా కనిపించని సూక్ష్మమైన చిప్‌లు, ఎలక్ట్రానిక్ రంగంలో, అతి ముఖ్యంగా వాహన ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా సమయంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి ఆగిపోవడంతో, ఆ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు మన దేశంపైనా తీవ్రంగా పడింది. ముఖ్యంగా, ఈ చిన్నపాటి చిప్‌లు దొరక్క వాహన తయారీ సంస్థలు వాటి ఉత్పత్తిని తగ్గించుకున్నాయి లేదా కొన్నాళ్ల పాటు తాత్కాలిక షట్‌డౌన్ ప్రకటించాయి.
ప్రస్తుతం, సెమీకండక్టర్ల అతి పెద్ద ఉత్పత్తి దేశం చైనా. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తాజా నివేదిక ప్రకారం, ప్రపంచంలోని సెమీకండక్టర్ ఉత్పత్తిలో 24% డ్రాగన్ కంట్రీ నుంచే వస్తోంది, ఆ తర్వాతి స్థానాల్లో తైవాన్‌లో 21%, దక్షిణ కొరియా 19% ఉన్నాయి. అంటే, ప్రపంచానికి అవసరమైన సెమీకండర్లలో పావువంతు చైనా నుంచే బయటకు వస్తున్నాయి. దీనికి తైవాన్, దక్షిణ కొరియా లెక్కలను కూడా కలిపితే, ప్రపంచ సరఫరాల్లో ముప్పావు వంతుకు కేవలం 3 దేశాలు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి, కమాండ్ చేస్తున్నాయి.
కరోనా సమయంలో ఈ దేశాల్లో చిప్ ఫ్యాక్టరీలు మూతబడి సప్లై ఆగిపోవడంతో, ఒక వస్తు ఉత్పత్తి కేంద్రకృతమైతే ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో ప్రపంచ దేశాలకు అర్ధమైంది. దీంతో, ఏ దేశానికి ఆ దేశం సెమీకండక్టర్ల ఉత్పత్తి ఫ్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించడం మొదలు పెట్టాయి. ప్రస్తుతం భారత్ కూడా అదే బాటలో నడుస్తోంది. సెమీకండక్టర్ల ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా భారత్‌ను తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో, భారత్‌లో ఫ్లాంట్లు నెలకొల్పే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే అంకుర సంస్థలకు DLI (డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్) అందిస్తోంది.
స్టార్టప్స్ కోసం ₹1,200 కోట్లు
సెమీకండక్టర్ డిజైన్ స్టార్టప్స్‌లో పెట్టుబడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ₹1,200 కోట్ల బడ్జెట్ కేటాయించారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అధికారిక నివేదికల ప్రకారం, 27 దేశీయ స్టార్టప్‌లు ఇప్పటికే ఈ కార్యక్రమం కింద అర్హత సాధించాయి. దిల్లీ IITలో, ఇవాళ, మూడో సెమికాన్ఇండియా ఫ్యూచర్ డిజైన్ రోడ్‌షో ప్రారంభమైంది.
"తదుపరి యునికార్న్ చిప్ డిజైన్ రంగం నుంచి వస్తుందని నమ్మకంతో ఉన్నాం. 2 ఫ్యూచర్ డిజైన్ స్టార్టప్‌లకు DLI పథకం కింద ఆర్థిక సాయానికి ఆమోదం లభించింది. ఆర్థిక సాయంతో పాటు డిజైనింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాం. అత్యాధినిక చిప్స్ సిస్టమ్‌ను రూపొందించడానికి మద్దతు ఇస్తాం" - భారత ప్రభుత్వ అధికారిక ప్రకటన
తదుపరి తరం (నెక్ట్స్ జెనరేషన్) సెమీకండక్టర్ డిజైనర్లను ఉత్సాహపరిచేందుకు భారత IT మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా రోడ్‌షోల సిరీస్ నిర్వహిస్తోంది. సెమీకండక్టర్ మార్కెట్‌లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇది. ఈ ఈవెంట్‌లో ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రధాన ప్రకటనలను వినే అవకాశం ఉంది.
శుక్రవారం రోడ్‌షో సందర్భంగా, గ్లోబల్ సెమీకండక్టర్ లీడర్‌లు భారతదేశంలోని సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను ఉత్ప్రేరకపరిచేందుకు దర్శనాలను పరస్పరం మార్చుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు.
VC సంస్థ సిక్వోయా క్యాపిటల్ ఇండియా (Sequoia Capital India), సెమీకండక్టర్ రంగంలోకి ప్రవేశించిన మొదటి సంస్థాగత పెట్టుబడిదారుగా ఇప్పటికే అవతరించింది. మరో రెండు డిజిటల్ ఇండియా స్టార్టప్‌లలో పెట్టుబడిని కూడా ప్రకటించనుంది. కస్టమ్ సిలికాన్ IP, హార్డ్‌వేర్ ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చడానికి డీప్ టెక్ స్టార్టప్‌లకు భారీ అవకాశం ఉందని సిక్వోయా క్యాపిటల్ ఇండియా తెలిపింది.