డిజిటల్ చెల్లింపుల కోసం, UPI వాడకం బాగా పెరిగింది. ఇది వచ్చినప్పటి నుండి ఎన్నో రకాల సేవలు ప్రజలకు ఈజీగా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా ఎన్నో చెల్లింపులు ఇంటి నుంచే చేసేస్తున్నారు. దుకాణదారులు UPI ద్వారా స్వీకరించడం లేదా చెల్లింపులు చేయడానికి అదనపు ఛార్జీలు విధించనున్నారని సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో ఈ వార్త కొందరు పోస్ట్ చేయగా.. నిమిషాల వ్యవధిలో వైరల్ అవుతోంది. అయితే, యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలపై ప్రభుత్వం స్పందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ చేస్తూ, ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. యూపీఐ ఛార్జీల పెంపు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇస్తూ అన్ని రకాల పుకార్లకు చెక్ పెట్టింది.
UPI పై ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానం
ఆర్థిక మంత్రిత్వ శాఖ తన పోస్ట్‌లో, ఈ విధంగా అనవసరమైన భయాందోళన పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. జూన్‌లో వీసా లావాదేవీల కంటే UPI ద్వారా ఎక్కువ లావాదేవీలు జరిగాయని తెలిపింది. 2025 జూన్ 1న UPI ద్వారా 64.4 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ మరుసటి రోజున లావాదేవీలు 65 కోట్లు దాటాయి. అయితే, ఒక సంవత్సరం కిందట 64 కోట్ల UPI లావాదేవీలు జరిగాయి.
కొత్త UPI చెల్లింపుల వ్యవస్థ
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో, భారత్‌లోని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలతో అనుసంధానమై ఉందని పేర్కొంది. 'భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. మార్చి 2025లో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా దాదాపు రూ. 24.77 లక్షల కోట్ల విలువైన 1,830.151 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.
అందులో దాదాపు 50 శాతం చిన్న లేదా చాలా చిన్న చెల్లింపులు ఉన్నాయని పేర్కొన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) గురించి బుక్‌లెట్‌లో మోదీ ప్రభుత్వం పారదర్శకతను తెలియజేసేందుకు, పాలనలో అవినీతిని నిరోధించడానికి సాంకేతికత, డిజిటల్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.