Government Gold Monetization Scheme: మనదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, ఆర్థిక భరోసా. అయితే, దేశంలోని ఇళ్లలో, మతపరమైన సంస్థల వద్ద సుమారు 25,000 నుండి 30,000 టన్నుల బంగారం నిరుపయోగంగా ఉందని అంచనా. ఈ బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా దేశీయంగా పసిడి కొరతను తగ్గించి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ను మరింత సరళతరం చేస్తూ కొత్త పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బిస్కెట్లు, కాయిన్స్ లేదా ఆభరణాల రూపంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం. ఇలా డిపాజిట్ చేసిన బంగారంపై ప్రభుత్వం నిర్ణీత వడ్డీని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, డిపాజిట్ చేసిన బంగారం స్వచ్ఛతను పరీక్షించి, దానిని కరిగించి నిల్వ చేస్తారు. మెచ్యూరిటీ సమయం తర్వాత, వినియోగదారులు ఆ బంగారాన్ని తిరిగి పసిడి రూపంలో లేదా అప్పటి మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో పొందవచ్చు. దీని వల్ల బంగారం భద్రతతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది.
గతంలో ఈ పథకం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం ట్యాక్స్ నోటీసులు వస్తాయనే భయం. అయితే, కొత్త పాలసీలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఉదాహరణకు తులాల లెక్కన డిపాజిట్ చేసే బంగారానికి ఎటువంటి ఆదాయపు పన్ను విచారణ ఉండదని, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపాల్సిన అవసరం లేదని వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. దీనివల్ల గృహిణులు, సామాన్య ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్థిక కోణంలో చూస్తే, భారత్ ఏటా వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోంది. ఒకవేళ దేశంలోని నిరుపయోగ బంగారం మార్కెట్లోకి వస్తే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గణనీయంగా తగ్గుతుంది. ఇది రూపాయి విలువను స్థిరీకరించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా మారుతుంది. అందుకే బ్యాంకులు కూడా గోల్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఆకర్షణీయంగా మార్చేలా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది.
ఈ పథకంలో చేరాలనుకునే వారు తమ బంగారాన్ని ప్రభుత్వం గుర్తించిన హాల్‌మార్కింగ్ కేంద్రాలలో పరీక్షించాల్సి ఉంటుంది. అక్కడ బంగారం నాణ్యతను బట్టి సర్టిఫికేట్ ఇస్తారు, దాని ఆధారంగా బ్యాంకులో ఖాతా తెరుస్తారు. కనీసం 10 నుండి 30 గ్రాముల నుంచి కూడా డిపాజిట్ చేసేలా నిబంధనలు సవరించవచ్చని సమాచారం. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీ అమల్లోకి వస్తే, బీరువాల్లో లాక్ అయి ఉన్న బంగారం దేశ ప్రగతిలో భాగస్వామి అవుతుంది.
