Onion Price: ఉల్లి ఎగుమతులపై సుంకం రద్దు - ఆనియన్‌ రేట్లు పెరుగుతాయా?

Export Duty On Onion: గతంలో, దేశంలో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరగడంతో, 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించి ఉల్లి పంటను ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Continues below advertisement

Government Abolishes Export Duty On Onion From April 2025: ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. ఉల్లి రేట్ల విషయం ప్రజలు సంతోషంగా ఉన్నప్పటికీ, గిట్టుబాటు ధరలు లేక రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఆనియన్‌ పండించే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయ ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 01, 2025 నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం, దేశం నుంచి ఎగుమతి చేసే ఉల్లిపాయలపై ప్రభుత్వం 20 శాతం ఎగుమతి పన్ను వసూలు చేస్తోంది.

Continues below advertisement

40% శాతం నుంచి 0% స్థాయికి
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని "సున్నా" ('0' - పూర్తిగా రద్దు) చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని 'కేంద్ర పరోక్ష పన్నులు & సుంకాల బోర్డు' (CBIC) తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 01, 2025 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. గతంలో, దేశంలో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరగడంతో 2023 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయ ఎగుమతిని నిషేధించింది. ఆ తర్వాత, 2024 మే నెలలో, ఉల్లిపాయలను విదేశాలకు విక్రయించడానికి అనుమతించింది. అయితే, కనీస ఎగుమతి ధర పరిమితి టన్నుకు 550 డాలర్లుగా ఉండాలని & 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలని నిర్దేశించింది. ఈ చర్యలతో దేశీయ మార్కెట్లలో ఉల్లి సరఫరా పెరగడంతో, 2024 సెప్టెంబర్‌లో కనీస ఎగుమతి ధరను రద్దు చేసింది. అదే సమయంలో ఎగుమతి సుంకాన్ని కూడా 20 శాతానికి తగ్గించింది. ఇప్పుడు, ఆ 20 శాతం ఎగుమతి సుంకాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. 

పెరిగిన ఎగుమతులు
ఎగుమతి నిషేధం ఉన్నప్పటికీ, మొత్తం ఉల్లిపాయ ఎగుమతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.17 లక్షల టన్నులు & 2024-25 ఆర్థిక సంవత్సరంలో (మార్చి 18 వరకు) 11.65 లక్షల టన్నులుగా నమోదైంది. ప్రభుత్వం గణాంకాల ప్రకారం, నెలవారీ ఉల్లిపాయ ఎగుమతి పరిమాణం 2024 సెప్టెంబర్‌లో 72 వేల టన్నుల నుంచి 2025 జనవరి నాటికి 1.85 లక్షల టన్నులకు పెరిగింది. రైతులకు లాభదాయకమైన ధరలు అందించడం & ప్రజల కోసం ఉల్లిపాయల ధరలను అదుపులో ఉంచడం అనే ప్రభుత్వ నిబద్ధతకు ఈ గణాంకాలు నిదర్శనమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇక్కడి నుంచి ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?
ప్రస్తుత మార్కెట్‌ ధరలు గత సంవత్సరాల ఇదే కాలం స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, అఖిల భారత సగటు మోడల్ ధరలు 39 శాతం తగ్గుదలను చూశాయి. అదేవిధంగా, గత నెల రోజుల్లో అఖిల భారత సగటు రిటైల్ ధరలు 10 శాతం తగ్గాయి. రబీ పంట బాగా వస్తుందనే అంచనాలతో టోకు & రిటైల్ ధరలు తగ్గాయి. ఈ ఏడాది రబీ ఉల్లిపాయల ఉత్పత్తి 227 లక్షల టన్నులుగా ఉంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది, ఇది గత సంవత్సరం 192 లక్షల టన్నుల కంటే 18 శాతం ఎక్కువ. "ఈ సీజన్‌లో ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడం వల్ల రాబోయే నెలల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.  భారతదేశ మొత్తం ఉత్పత్తిలో 70-75 శాతం వాటా కలిగిన రబీ ఉల్లిపాయలు, అక్టోబర్-నవంబర్ నెలల్లో ఖరీఫ్ పంట వచ్చే వరకు మార్కెట్ ధరల స్థిరత్వానికి చాలా కీలకం.

Continues below advertisement
Sponsored Links by Taboola