జనాల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీకి లోన్లు ఇచ్చి.. డబ్బుల కోసం పీల్చి పిప్పి చేసే లోన్ యాప్స్ పై గత కొంత కాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్‌స్టంట్ లోన్ ఇస్తామని చెప్పే యాప్స్  బారిన పడి చాలా మంది అమాయకులు ఇబ్బంది పడుతున్నారు. తీసుకున్న అప్పు నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించకపోతే.. లోన్ యాప్స్ నిర్వాహకులు పెట్టే ఇబ్బందులు వర్ణనాతీతం. వీటి బాధలు తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇన్ స్టంట్ లోన్ యాప్స్ మీద కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది. పలు యాప్స్ ను బ్యాన్ చేసింది.


2 వేల లోన్ యాప్స్ తొలగించిన గూగుల్.. 
కేంద్ర ప్రభుత్వం తరహాలోనే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆలోచిస్తోంది. జనాలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న లోన్ యాప్స్ పై ఉక్కుపాదం మోపింది. సుమారు 2 వేల పర్సనల్ లోన్ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇందులో చాలా వరకు విదేశాలకు చెందిన లోన్ యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ భారతీయులను టార్గెట్ చేసుకుని తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి కారణంగా అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గూగుల్ గుర్తించింది. దీంతో స్థానిక చట్ట సంస్థల అభిప్రాయాల మేరకు వీటిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఆసియా పసిఫిక్ సీనియర్ డైరెక్టర్ సాయికత్ మిత్రా వెల్లడించారు. మున్ముందు మరిన్ని యాప్స్ మీద వేటు వేయబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి యాప్స్ నుంచి రక్షణ కోసం పాలసీ విధానంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.    


ఆన్ లైన్ భద్రత కోసం కృషి.. 
లోన్ యాప్స్ కొన్నిసార్లు వినియోగదారుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడంతో పాటు మితిమీరి ప్రవర్తిస్తున్నాయి. కొన్ని సంస్థలు చైనా కంపెనీలకు డబ్బును లాండరింగ్ చేయడానికి ఈ వ్యాపారాన్ని ఉపయోగించుకుంటున్నాయి. దీంతో సదరు యాప్స్ మీద కేంద్రం ఫోకస్ పెట్టింది. కేంద్ర ఐటీ శాఖ సహకారంతో ఆన్ లైన్ భద్రత కోసం కృషి చేస్తున్నట్లు తాజాగా ప్రకటించిన గూగుల్.. ఇప్పుడు లోన్ యాప్స్ పై వేటు వేసి అనుకున్న పనిని మొదలుపెట్టినట్లు నిరూపించింది. గూగుల్ తో పాటు మరికొన్ని సంస్థలు కూడా లోన్ యాప్స్ ను బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా గూగుల్ తన యాప్ స్టోర్ నుంచి పెద్ద సంఖ్యలో యాప్స్ తొలగించింది. ఈ యాప్స్ ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించేందుకు సుమారు 60 రోజులు గడువు ఇవ్వాలి. కానీ.. అలాంటి గడువు లేకుండా డబ్బులు చెల్లించడంలో ఒక్క రోజు లేటైనా వేధించడం మొదలుపెడుతున్నాయి. ఇలాంటి కేసులో నిత్యం జరుగుతుండటంతో భారతీయ రిజర్వు బ్యాంకు లోన్ యాప్స్ మీద కఠిన ఆంక్షలు విధించింది.  లోన్ యాప్‌లు ఖాతాదారుల డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధించేలా మార్గదర్శకాలు  విడుదల చేసింది. లోన్ యాప్ నిర్వాహకులు విధించే వడ్డీని బయటకు చెప్పాలని ఆదేశించింది.   


తాజాగా ఏపీకి చెందిన మంత్రులు, మాజీ మంత్రులకు సైతం లోన్ యాప్స్ నుంచి తలనొప్పులు ఎదుర్కొన్నారు. ఎవరో తెలియని వ్యక్తులు ష్యూరిటీగా తమ నెంబర్లు ఇవ్వడంతో.. వారికి లోన్ యాప్స్ ప్రతినిధులు ఫోన్ చేసి వేధించారు. ఈ క్రమంలో పలువురు లోన్ యాప్స్ నిర్వాహకులు, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.