Google CEO Sundar Pichai: భారతదేశాన్ని ప్రధాన ఎగుమతి ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు గూగుల్ CEO సుందర్ పిచాయ్. భారత పర్యటనకు వచ్చిన పిచాయ్, దిల్లీలో జరిగిన 'గూగుల్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో మాట్లాడారు. భారత్ నుంచి నడుస్తున్న స్టార్టప్‌ల మీద గూగుల్ దృష్టి సారిస్తోందని చెప్పారు. ఈ అంకుర కంపెనీల కోసం కేటాయించిన 300 మిలియన్ డాలర్లలో నాలుగో వంతును (75 మిలియన్ డాలర్లు) మహిళల నేతృత్వంలో నడిచే స్టార్టప్‌లలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు పిచాయ్ చెప్పారు. తన పర్యటనలో మొదటి రోజున, కేంద్ర టెలికాం & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
భారత్‌లోని చిన్న వ్యాపారాలకు గూగుల్ మద్దతు
సుందర్ పిచాయ్‌తో జరిగిన సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయో గూగుల్ వెల్లడించలేదు. భారతదేశంలోని చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం; సైబర్ భద్రతలో గూగుల్ పెట్టుబడి వంటి అంశాలను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానంటూ తన పర్యటన ప్రారంభంలో పిచాయ్ స్వయంగా రాసిన బ్లాగ్‌లో తెలిపారు. ఇది కాకుండా, విద్య, నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI లేదా కృత్రిమ మేధ) వినియోగంలో గూగుల్ చొరవ మీద కూడా చర్చ జరుగుతుందని బ్లాగ్‌లో పేర్కొన్నారు.
100కు పైగా భారతీయ భాషల్లో సెర్చ్
'గూగుల్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో పాల్గొన్న పిచాయ్.. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ బలంగా పని చేస్తోందని, ప్రపంచ ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. అటువంటి సమయంలో, బాధ్యతాయుతమైన, సమతుల్య నియమాలను రూపొందించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయని అన్నారు. 100కు పైగా భారతీయ భాషల్లో టెక్ట్, వాయిస్ ద్వారా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే వీలు కల్పించేందుకు గూగుల్ ప్రయత్నాలు చేస్తోందని సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తామని చెప్పారు.
భారతదేశ డిజిటల్ భవిష్యత్తును నడిపించనున్న గూగుల్
భారత్ కోసం, గతంలో తాము ప్రకటించిన వెయ్యి కోట్ల డాలర్లతో పదేళ్ల కాలం కోసం ఏర్పాటు చేసిన ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (IDF) నుంచి ఖర్చు చేసిన నిధుల వల్ల ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎంతమేర పురోగతి ఉందో చూడడానికి, కొత్త సాంకేతికతల గురించి పంచుకోవడానికి భారత్ వచ్చినట్లు సుందర్ పిచాయ్ చెప్పారు. "భారతదేశ డిజిటల్ భవిష్యత్తును నడిపించడంలో మేము సహాయం చేస్తున్నాం. AI ఆధారంగా, ఒకే సమగ్ర మోడల్‌ను అభివృద్ధి చేయడం మా మద్దతులో భాగం. ఇది, పదాలు & మాటల ద్వారా 100కు పైగా భారతీయ భాషల్లో ఆపరేట్ చేయగలదు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1,000 భాషలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడానికి చేపట్టిన చొరవలో ఇదొక భాగం" అని పిచాయ్ వెల్లడించారు.
AI ద్వారా ఒక బిలియన్ భారత ప్రజలకు ప్రయోజనం
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ సహకారంతో, ప్రతిస్పందించే AI కోసం కొత్త, బహుళ అంశాల కేంద్రానికి కూడా గూగుల్ మద్దతు ఇస్తోందని ఆయన చెప్పారు. AI పట్ల గూగుల్ తీసుకుంటున్న గ్లోబల్ చొరవలో ఇది ఒక భాగం. “AI రంగంలో భారతదేశం కొత్త అడుగులు ఎలా వేస్తుందో చూడాలని నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. దీనివల్ల భారతదేశంలోని ఒక బిలియన్‌కు పైగా ప్రజలు ప్రయోజనం పొందవచ్చు" అని పిచాయ్ వెల్లడించారు.