GoM Agrees To Levy 28 Per Cent GST On Casinos, Race Course, Online Gaming : క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై విధిస్తున్న వస్తుసేవల పన్ను (GST)పై రాష్ట్ర మంత్రుల కమిటీ సమీక్ష ముగిసింది. వీటిపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు దాదాపుగా ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టును రానున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మేఘాలయా ముఖ్యమంత్రి కాన్‌రాడ్‌ సంగ్మా ఈ కమిటీకి నేతృత్వం వహించారు.

ఈ సేవలపై 28 శాతం జీఎస్‌టీని విధించడంపై మంత్రుల కమిటీ ఈ నెల మొదట్లోనే సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సేవలకు విలువ కట్టేందుకు చేపట్టాల్సిన విధానంపై మంత్రుల కమిటీ  తాజాగా బుధవారం సమావేశమైంది. తుది నివేదికను సిద్ధం చేసింది.

'క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై వేసిన మంత్రుల కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. మేం సిద్ధం చేసిన నివేదికను ఒకట్రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తాం. వచ్చే జీఎస్‌టీ మండలి సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చిస్తారు' అని కాన్‌రాడ్‌ సంగ్మా ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ఈ సేవలను సరిగ్గా విలువ కట్టేందుకు ఆయా రాష్ట్రాల మంత్రులతో గతేడాది మేలోనే ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఇందులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, గుజరాత్‌ ఆర్థిక మంత్రి కనుభాయ్‌ పటేల్‌, గోవా పంచాయతీ రాజ్‌ మంత్రి మౌవిన్‌ గోడిన్హో, తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగ రాజన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా, తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హరీశ్‌ రావ్‌ ఉన్నారు.