Top-10 Countries That Own Most Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల బ్రిటన్ నుంచి భారత్‌కు 100 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చింది. అది భారతదేశానికి చెందిన బంగారమే. 1991లో, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి భారత్ ఈ బంగారాన్ని తాకట్టు పెట్టింది. అప్పటి నుంచి ఆ బంగారమంతా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సేఫ్‌ల్లోనే ఉంది. ఇప్పుడు.. తాకట్టు బంగారాన్ని ఇంగ్లండ్ నుంచి తిరిగి తీసుకొచ్చిన కేంద్ర బ్యాంక్.. ముంబై, నాగ్‌పూర్ కార్యాలయాల్లో భద్రపరిచింది.
ఆర్‌బీఐ భారీ మొత్తంలో పసిడిని తీసుకువచ్చేసరికి, ఆ వార్త దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీంతో.. భారతదేశంలో ఎంత బంగారం ఉంది, ప్రపంచంలో ఏ దేశం ఎంత పసిడిని నిల్వ చేసిందన్న ప్రశ్నలు తలెత్తాయి. పెద్ద దేశాల్లో ఎంత గోల్డ్ రిజర్వ్ ఉందనే ఉత్సుకత ప్రజల్లో పెరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు గూగుల్‌లో వెదుకుతున్నారు.
విదేశాల్లో 500 టన్నుల బంగారం
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి భారతదేశంలో దాదాపు 800 టన్నుల బంగారం ఉంది. ఇందులో దాదాపు 500 టన్నులు విదేశాల్లో, 300 టన్నులు భారత్‌లో ఉంచారు. ఇప్పుడు, RBI 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తిరిగి తీసుకువచ్చిన తర్వాత ఈ నంబర్ శాతం పెరిగింది. ప్రస్తుతం, రిజర్వ్ బ్యాంక్ దగ్గర 822 టన్నుల బంగారం ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 794.63 టన్నులు ఉంది. గత కొన్నేళ్లుగా, ఆర్‌బీఐ నిరంతరం బంగారం కొనుగోలు చేస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే, మనం త్వరలోనే జపాన్‌ను అధిగమించొచ్చు. ప్రస్తుతం జపాన్ దగ్గర దాదాపు 845 టన్నుల బంగారం ఉంది.
మిడిల్ ఈస్ట్‌లో వివాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతోపాటు, రష్యాపై అమెరికా నిరంతర ఆంక్షలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని, ఇటీవలి కాలంలో అన్ని దేశాల కేంద్ర బ్యాంక్‌లు బంగారం కొనుగోళ్లను పెంచాయి. యుద్ధం ప్రభావంతో తమ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారకుండా భద్రత కల్పించడానికి విరివిగా పసిడి కొనుగోళ్లు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే, RBI కూడా 100 టన్నుల గోల్డ్‌ను స్వదేశానికి తీసుకువచ్చినట్లు నిపుణులు తెలిపారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న 10 దేశాలు ఇవి (top 10 countries that own the most gold):
అమెరికా – – – 8,133.46 టన్నులు ($579,050.15 మిలియన్లు)
జర్మనీ – – – 3,352.65 టన్నులు ($238,662.64 మిలియన్లు)
ఇటలీ – – – 2,451.84 టన్నులు ($174,555.00 మిలియన్లు)
ఫ్రాన్స్ – – – 2,436.88 టన్నులు ($173,492.11 మిలియన్లు)
రష్యా – – – 2,332.74 టన్నులు ($166,076.25 మిలియన్లు)
చైనా – – – 2,262.45 టన్నులు ($161,071.82 మిలియన్లు)
స్విట్జర్లాండ్ – – – 1,040.00 టన్నులు ($69,495.46 మిలియన్లు)
జపాన్ – – – 845.97 టన్నులు ($60,227.84 మిలియన్లు)
భారత్ – – – 822.09 టన్నులు ($58,527.34 మిలియన్లు)
నెదర్లాండ్స్ – – – 612.45 టన్నులు ($43,602.77 మిలియన్లు)
ప్రపంచంలోని చాలా సెంట్రల్ బ్యాంక్‌లు పోటాపోటీగా కొనుగోళ్లు చేస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్లో మెటల్ రేటు నిరంతరం పెరుగుతోంది.
మరో ఆసక్తికర కథనం: 7.5 కోట్ల మందికి గుడ్‌న్యూస్ - పీఎఫ్ ఖాతాలో ఈ తప్పులను ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు