Gold Reserves In India 2024: గత కొన్నేళ్లుగా భారత్‌లో బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. పసిడి కొనుగోళ్లు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది మే నెలలో కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) పెద్ద మొత్తంలో గోల్డ్‌ కొనుగోలు చేసింది. 


గత నెలలో టన్నుల కొద్దీ కొనుగోళ్లు
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) డేటా ప్రకారం, 2024 మే నెలలో భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేసిన దేశాల్లో భారత్‌ది మూడో స్థానం. ఆ నెలలో మన దేశం రూ.722 కోట్ల విలువైన ఎల్లో మెటల్‌ను పర్చేజ్‌ చేసింది. పరిమాణం ప్రకారం చూస్తే... అది 45.9 టన్నులు అవుతుంది. పసిడి నిల్వలు పెంచుకునేందుకు భారత్ చూపిస్తున్న దూకుడుకు ఈ లెక్క ఒక ఉదాహరణ.


గత నెలలో, బంగారం కొనుగోళ్లలో భారత్ కంటే రెండు దేశాలు మాత్రమే ముందున్నాయి. 312.4 టన్నుల బంగారం కొనుగోలు చేసిన స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఈ పర్చేజ్‌ వాల్యూ రూ.2,461 కోట్లు. మన పొరుగు దేశం చైనా 86.8 టన్నుల బంగారాన్ని రూ.2,109 కోట్లకు కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలిచింది.


ఐదేళ్లలో భారీగా పెరిగిన బంగారం నిల్వలు
గత ఐదేళ్లుగా భారత్‌లో బంగారం గణనీయంగా పేరుకుపోతోంది. 2019 మార్చిలో, మన దేశం దగ్గర 618.2 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ స్టాక్ 2024 మార్చి నాటికి 822.1 టన్నులకు పెరిగింది. అంటే, గత 5 సంవత్సరాల్లో భారతదేశ బంగారు ఖజానా 33 శాతం పెరిగింది.


దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలకు స్థిరత్వం కల్పించేందుకు, పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు బంగారం కొనుగోలు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల చెప్పారు. డాలర్ అస్థిరత కారణంగా, రిజర్వ్ బ్యాంక్ దగ్గర బంగారం నిల్వలను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.


ఎల్లో మెటల్‌ను సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా పసిడికి డిమాండ్, రేటు పెరుగుతుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ సహా ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి.


వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం, పసిడి నిల్వలు ఎక్కువగా ఉన్న 10 దేశాలు ‍‌(top 10 countries that own the most gold):


1. అమెరికా  – – –   8,133.46 టన్నులు 
2. జర్మనీ   – – –   3,352.65 టన్నులు
3. ఇటలీ   – – –   2,451.84 టన్నులు 
4. ఫ్రాన్స్   – – –   2,436.88 టన్నులు 
5. రష్యా   – – –   2,332.74 టన్నులు 
6. చైనా   – – –   2,262.45 టన్నులు
7. స్విట్జర్లాండ్   – – –  1,040.00 టన్నులు
8. జపాన్   – – –   845.97 టన్నులు 
9. భారత్‌   – – –   822.09 టన్నులు 
10. నెదర్లాండ్స్   – – –   612.45 టన్నులు 


బంగారం కొనుగోళ్లలో దూకుడును భారత్‌ కొనసాగితే, పసిడి నిల్వల విషయంలో అతి త్వరలోనే జపాన్‌ను అధిగమించొచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఈ క్రెడిట్‌ కార్డ్‌ మీ దగ్గరుంటే ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లోకి ఫ్రీ ఎంట్రీ