Gold Rate At New Record High: అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్ యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ (US Fed), బంగారం రేటుకు ఆజ్యం పోసింది. ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ ‍‌(Jerome Powell) కామెంట్ల తర్వాత బంగారం రేటు శ్రీహరికోట రాకెట్‌లా నిట్టనిలువుగా దూసుకెళ్లింది. ఈ రోజు (గురువారం, 21 మార్చి 2024) 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,000 పెరిగింది. 


మంగళ, బుధవారాల్లో సమావేశమైన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (Federal Open Market Committee - FOMC), బుధవారం నాడు (భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి తర్వాత) తన నిర్ణయాలను ప్రకటించింది. యూఎస్‌ ఫెడ్‌ ఈసారి కూడా ప్రామాణిక వడ్డీ రేట్లను మార్చలేదు, వరుసగా ఐదో సమావేశంలోనూ వడ్డీ రేట్లను 5.25-5.50 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఇది 23 సంవత్సరాల గరిష్ట స్థాయి. వడ్డీ రేట్లను ఫెడ్‌ మార్చదు అన్న విషయాన్ని ముందు నుంచీ మార్కెట్‌ ఊహిస్తోంది కాబట్టి, పసిడి రేట్లు దీనికి రియాక్ట్‌ కాలేదు. అయితే, వడ్డీ రేట్ల ప్రకటన సమావేశంలో పావెల్‌ చేసిన కామెంట్లు కాక పుట్టించాయి. 2024 క్యాలెండర్‌ ఇయర్‌ ముగింపు నాటికి వడ్డీ రేట్లు 4.50 - 4.75 శాతం మధ్య ఉండొచ్చని పావెల్‌ చెప్పారు. అంటే, ఈ సంవత్సరం ముగిసే లోపు 0.75 శాతం పాయింట్ల కోతలు ఉంటాయని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. ఇది మూడు దఫాల్లో, ఒక్కో దఫాలో 0.25 శాతం మేర పాయింట్ల కోత ఉండొచ్చని మార్కెట్‌ లెక్కలు వేసింది.


వడ్డీ రేట్లకు - బంగారానికి విలోమానుపాత సంబంధం ఉంటుంది. అంటే, వడ్డీ రేట్లు పెరిగితే బంగారంలో పెట్టుబడులు తగ్గి, పసిడి ధర కూడా తగ్గుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే, పసిడిలోకి పెట్టుబడులు పెరిగి, రేటు పెరుగుతుంది. ఇప్పుడు, వడ్డీ రేట్లను తగ్గిస్తామన్న సంకేతాలు ఫెడ్‌ నుంచి రావడంతో, సేఫ్‌ హెవెన్‌ గోల్డ్‌లోకి పెట్టుబడులు భారీగా ప్రవహించాయి. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్లో మెటల్‌ డిమాండ్‌, రేటు ఆటోమేటిక్‌గా పెరిగాయి.


ఫెడ్‌ నిర్ణయాల తర్వాత, అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు దూసుకెళ్లింది. ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర రికార్డ్‌ స్థాయిలో 2,200 డాలర్ల పైన కదులుతోంది, ప్రస్తుతం, 2,206 డాలర్ల వద్ద ఉంది. 


పాత రికార్డ్‌ బద్ధలు కొట్టిన బంగారం


పావెల్‌ ప్రకటన తర్వాత మన దేశంలోనూ బంగారం ధరలు విజృంభించాయి, మరోమారు రికార్డ్‌ సృష్టించాయి. ఫెడ్ నుంచి సానుకూల కామెంట్లను ఆశించిన భారతీయ పెట్టుబడిదార్లు, బుధవారం సాయంత్రం నుంచే పసిడి వెంటపడడం ప్రారంభించారు. దీంతో, బుధవారం సాయంత్రం ప్రారంమైన గోల్డ్‌ ర్యాలీ ఈ రోజు కూడా కొనసాగింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్‌లో (MCX) ట్రేడ్‌ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే, గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు ఏకంగా రూ.1,000 పైగా పెరిగింది. గత ముగింపు రూ. 66,100 నుంచి హై జంప్‌ చేసి రూ. 66,778 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది.


ఈ రోజు, మన దేశంలో... 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 1,000 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 1,090 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 820 రూపాయల చొప్పున పెరిగాయి. 


తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధర


తెలుగు రాష్ట్రాల్లో... 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 61,800 వద్దకు; 24 క్యారెట్ల రేటు ₹ 67,420 వద్దకు; 18 క్యారెట్ల ధర ₹ 50,560 వద్దకు చేరింది. 


వెండి ధర కూడా చుక్కల్ని తాకుతోంది. ఈ రోజు కిలో వెండి రేటు ఏకంగా ₹ 1,500 పెరిగింది. ప్రస్తుతం, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర ₹ 81,500 కు చేరింది. 


ఇప్పుడు బంగారం కొనొచ్చా, కొంతకాలం ఆగాలా?


వడ్డీ రేట్లు పెరిగితే బంగారానికి డిమాండ్‌ తగ్గుతుంది. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం డిమాండ్‌ పెరుగుతుంది. ఇకపై వడ్డీ రేట్లలో కోతలు ఉంటాయని ఫెడ్‌ సిగ్నల్స్‌ ఇచ్చింది కాబట్టి, పెట్టుబడి కోసం పసిడిని కొనేవాళ్లు దీనిని ఒక అవకాశంగా చూడొచ్చని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఒకవేళ, బంగారు నగలు కొనాలని భావిస్తుంటే, కొంతకాలం ఎదురు చూడమని సలహా ఇస్తున్నారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పిల్లల పథకం అమృత్‌బాల్‌ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఏంటి ప్రత్యేకత?