Adani Group Stocks Market Cap: అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడంతో అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. దీని కారణంగా స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టైన అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ.2 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది. అదానీ గ్రూప్ షేర్లలో 20 శాతం వరకు పతనం చవిచూడాల్సి వచ్చింది. దీంతో గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.3 లక్షల కోట్లకు పడిపోయింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ ఒక్క రోజులో 12.1 బిలియన్ డాలర్లు పడిపోయింది.


అదానీ స్టాక్స్ 20 శాతం క్రాష్‌
గౌతమ్ అదానీపై అమెరికా ఫెడరల్ కోర్టులో లంచం, మోసం ఆరోపణలు రావడంతో, ఉదయం భారత స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 20 శాతం పడిపోయింది. అదానీ పోర్ట్స్ 15 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 18.31 శాతం, అదానీ పవర్ 11.54 శాతం, అదానీ విల్మార్ 10 శాతం, అంబుజా సిమెంట్ 10.84 శాతం, అదానీ గ్యాస్ 13.37 శాతం క్షీణించాయి.


గౌతమ్ అదానీ నికర విలువలో భారీ తగ్గుదల
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం... అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనం కారణంగా గౌతమ్ అదానీ నికర సంపద భారీగా పడిపోయింది. నవంబర్ 21 న ఒక్క సెషన్‌లో 12.1 బిలియన్ డాలర్లు తగ్గి 57.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది.


అదానీ గ్రూప్, గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా అమెరికాలో కేసుల ప్రభావం అదానీ గ్రూప్ కంపెనీలకు ప్రతికూలంగా ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. మార్చి 2023లో హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన రాజీవ్ జైన్‌కు చెందిన GQG భాగస్వాములు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు అదానీ గ్రూప్ ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా ఆస్ట్రేలియాలో GQG సొంత షేర్లు 26 శాతం పడిపోయాయి. పరిస్థితిని అధ్యయనం చేస్తున్నామని GQG ఓ ప్రకటనలో తెలిపింది.


Also Read: అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన


అసలు ఏం జరిగింది?


ఆదానీ గ్రూప్‌లో ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ అతి పెద్ద సోలార్ పవర్‌ను భారత ప్రభుత్వానికి విక్రయించడానికి చేసుకున్న ఒప్పందంపై అమెరికాలో కేసు నమోదు అయింది. అదానీతో పాటు ఇతర నిందితులు వాల్ స్ట్రీట్ కంపెనీ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పొందేందుకు రికార్డులు తప్పుగా చూపించారని అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణ. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీ, వినీత్ జైన్‌లు రుణాలు, బాండ్స్‌ ద్వారా ఇన్వెస్టర్స్ నుంచి 3 బిలియన్ డాలర్స్‌కుపైగా విదేశీ నిధులు సేకరించారు. 


భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో అధికారులకు లంచాలు ఇచ్చి ప్రాజెక్టు కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నట్టు చూపించి దాచిపెట్టారని అమెరికా కోర్టు తెలిపింది. మోసపూరితంగా సేకరించిన కాంట్రాక్టులకు అమెరికాలో సేకరించిన ఫండ్స్‌ వాడారని అభియోగం. ఈ కేసుపై అదానీ గ్రీన్ స్పందించి యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన నేరారోపణలు ఖండించింది. అంతే కాకుండా USD-డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా వెల్లడించింది.


Also Read: లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన - కఠిన నిర్ణయం తీసుకున్న గౌతమ్‌ అదానీ