Gautam Adani Become Richest Indian: అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ, చరిత్రను పునరావృతం చేశారు. ఏడాది క్రితం కోల్పోయిన రిచెస్ట్‌ పర్సన్‌ ‍‌(Richest Person) కిరీటాన్ని మళ్లీ సాధించారు. భారత్‌తో పాటు ఆసియాలోనూ అత్యంత సంపన్న వ్యక్తి హోదాను తిరిగి చేజిక్కించుకున్నారు. గౌతమ్‌ అదానీ స్పీడ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్‌ ముకేష్ అంబానీ వెనుకబడ్డారు. 


గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్ స్టాక్స్ విపరీతంగా పెరగడంతో, గౌతమ్ అదానీ సంపద విలువ వేగంగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ‍‌(Bloomberg Billionaires Index) ప్రకారం, ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముకేష్ అంబానీని దాటి, గౌతమ్ అదానీ 12వ స్థానానికి చేరుకున్నారు.


గౌతమ్ అదానీ ఆస్తుల విలువ ఎంత?
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం... గత 24 గంటల్లో గౌతమ్ అదానీ ఆస్తుల విలువ అతి భారీగా 7.6 బిలియన్ డాలర్లు పెరిగింది, మొత్తం (Gautam Adani Net Worth) 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముకేష్ అంబానీ సంపద (Mukesh Ambani Net Worth)  97 బిలియన్ డాలర్లుగా ఉంది, గత 24 గంటల్లో ఆయన నికర విలువ 764 మిలియన్‌ డాలర్లు పెరిగింది. 


నిన్న (గురువారం), ప్రపంచ సంపన్నుల జాబితాలో 14వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, గ్రూప్ షేర్లలో విపరీతమైన పెరుగుదల కారణంగా, ఈ రోజు (శుక్రవారం, 05 జనవరి 2024) 12వ ప్లేస్‌లోకి ఎక్కారు. తద్వారా, ముకేష్ అంబానీ మీదు నుంచి జంప్‌ చేసి, ఇటు ఇండియాలో & అటు ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యారు.


హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు  (Supreme Court verdict on Adani Group-Hindeburg Research case) వచ్చిన నాటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ షేర్లలో గత రెండు రోజుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. 


అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, సెబీ దర్యాప్తును సమర్థించింది. 24 కేసుల్లో పూర్తి కాకుండా మిగిలిన ఆ 2 కేసులను కూడా దర్యాప్తు చేయడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సెబీకి మరో 3 నెలల సమయం ఇచ్చింది. ఇప్పటికే 22 కేసుల విచారణ పూర్తయింది. సెబీ దర్యాప్తులో ఎలాంటి లోటుపాట్లు లేవని, కేసును సిట్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇది గౌతమ్‌ అదానీకి అతి పెద్ద ఊరట. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదానీ గ్రూప్‌ షేర్ల ధరలు పెరుగుతూ వచ్చాయి. ఆ ప్రభావం నేరుగా గౌతమ్ అదానీ ఆస్తిపాస్తులపై కనిపించింది. 


ప్రపంచంలోని టాప్-3 ధనవంతులు
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఎక్స్, స్టార్‌లింక్, టెస్లా ఓనర్‌ ఎలాన్ మస్క్ పేరు అగ్రస్థానంలో ఉంది. మస్క్‌ మామ నికర విలువ (Elon Musk Net Worth) 220 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో రెండో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు, అతని మొత్తం సంపద విలువ 169 బిలియన్ డాలర్లు. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LV (Louis Vuitton) యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ థర్డ్‌ ప్లేస్‌లో ఉన్నారు, ఆయన నికర విలువ 168 బిలియన్ డాలర్లు.


మరో ఆసక్తికర కథనం: గతేడాది 2,600 కోట్ల యాప్‌ డౌన్‌లోడ్స్‌ - పాపులర్‌ యాప్స్‌ ఇవే