Bloomberg Billionaires Index: గత వారం ‍‌(2022 డిసెంబర్‌ 19-23, సోమ-శుక్రవారాలు) ఇండియన్‌ స్టాక్ మార్కెట్లకు ఒక పీడకల. ఒక్క శుక్రవారం రోజే పెట్టుబడిదారుల సంపద రూ. 8.40 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి, BSEలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 280.53 లక్షల కోట్లు కాగా, శుక్రవారం వ్యాపారం ముగిసే సమయానికి రూ. 272.12 లక్షల కోట్లకు తగ్గింది. భారత స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్ 980 పాయింట్లు పతనమై 59,845 వద్ద, NSE నిఫ్టీ 320 పాయింట్ల నష్టంతో 17,806 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలక స్థాయులైన 60,000 దిగువకు సెన్సెక్స్‌, 18,000 దిగువకు నిఫ్టీ చేరుకున్నాయి.


భారత బిలియనీర్స్‌ సంపద గల్లంతు
స్టాక్‌ మార్కెట్ల పతనం కారణంగా, భారతదేశంలో బిలియనీర్ పెట్టుబడిదారులు సంపద కూడా భారీగా క్షీణించింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో, టాప్-10లో ఉన్న భారతీయ బిలియనీర్లు గౌతమ్ అదానీ (Gautam Adani), ముకేష్ అంబానీ (Mukesh Ambani ) కూడా భారీ నష్టాలను చవి చూశారు. అదే ఇండెక్స్‌లోని టాప్ 50లో ఉన్న బిలియనీర్ శివ్ నాడార్ ‍‌(Shiv Nadar) సంపదలోనూ భారీ కోత కనిపించింది.


గౌతమ్ అదానీ సంపద ఎంత తగ్గింది?
బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.., 2022 డిసెంబర్ 24న, శనివారం నాటికి గౌతమ్ అదానీ సంపద 110 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది, ఒక్క రోజులో 9.38 బిలియన్‌ డాలర్ల క్షీణతను చూసింది. భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఈ సంవత్సరం బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకారు. అయితే, ఆ ర్యాంక్‌లో ఎక్కువ రోజులు కొనసాగలేదు. భారత మార్కెట్‌లో క్షీణత కారణంగా ఆయన గ్రూప్‌ కంపెనీల షేర్లు పడిపోయాయి.  గౌతమ్ అదానీ మళ్లీ మూడో స్థానంలోకి వచ్చి చేరారు. ఈ ఏడాది మొత్తం చూస్తే, గౌతమ్ అదానీ ఆస్తులు 33.8 బిలియన్ డాలర్లు పెరిగాయి.


ముకేష్ అంబానీ సంపద ఎంత తగ్గింది?
బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని టాప్ 10 జాబితాలో 9వ స్థానంలో ఉన్న భారతదేశపు రెండో బిలియనీర్ ముకేష్‌ అంబానీ సంపద కూడా భారీ క్షీణించింది. ముకేష్ అంబానీ మొత్తం ఆస్తులు 85.4 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి, శుక్రవారం నాటి ట్రేడింగ్ తరువాత ఆయన నికర విలువ 2.71 బిలియన్‌ డాలర్లు క్షీణించింది. ఈ ఏడాది మొత్తం చూస్తే, ముఖేష్ అంబానీ 4.55 బిలియన్ డాలర్ల విలువైన సంపదన కోల్పోయారు.


శివ్‌ నాడార్ నికర విలువ ఎంత తగ్గింది?
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (HCL Technologies) ఫౌండర్‌ & ఛైర్మన్‌ శివ్ నాడార్ నికర విలువ మీద కూడా స్టాక్‌ మార్కెట్‌ పతనం ప్రభావం కనిపించింది. ప్రస్తుతం ఆయన నికర విలువ 24.4 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. ప్రస్తుతం, బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని టాప్ 50 సంపన్నుల జాబితాలో 49వ స్థానంలో శివ్‌ నాడార్‌ ఉన్నారు. శుక్రవారం మార్కెట్లు పడిపోయిన తర్వాత, ఈ బిలియనీర్‌ సంపద 196 మిలియన్‌ డాలర్లు తగ్గింది. ఈ సంవత్సరం మొత్తం చూస్తే, శివ్ నాడార్ ఆస్తిలో 8.20 బిలియన్‌ డాలర్లు క్షీణత నమోదైంది.


గౌతమ్ అదానీ అరుదైన రికార్డ్‌
విశేషం ఏంటంటే, బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ఈ ఏడాది మొత్తం సంపద పెంచుకుంది గౌతమ్ అదానీ ఒక్కడే. మిగిలిన 9 మంది సంపన్నుల నికర విలువ ఈ ఏడాదిలో భారీగా క్షీణించింది.