IT Returns 2022: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు గడువు జులై 31వ తేదీతో ముగిసింది. అందుకే పన్ను చెల్లింపుదారులు ఐటీ పోర్టల్‌కు పోటెత్తారు. గడువు పెంచేందుకు ప్రభుత్వం అంతగా సుముఖత చూపకపోవడంతో.. ఆదివారం ఒక్క రోజులోనే రాత్రి 11 గంటల వరకు 67,97,067 రిటర్నులు దాఖలు అయినట్లు ఐటీ విభాగం వెల్లడించింది. శనివారం వరకు 5.10 కోట్లకుపైగా దాఖలైన విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం రాత్రి 11 గంటల వరకు చూస్తే ఈ సంఖ్య దాదాపు 5.78 కోట్లకు చేరింది. 


మరో గంట సమయంలోనే ఇంకో 5 లక్షలు దాఖలు కావొచ్చు..


గడువు ముగిసేందుకు మరో గంట సమయం ఉన్నందున ఇంకో 5 లక్షల వరకు దాఖలు కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంటే దాదాపు 5.83 కోట్ల ఐటీఆర్ లు దాఖలు కావచ్చు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, పొడగించిన గడువు తేదీ 2021 డిసెంబర్ 31 వరకు చూస్తే దాదాపు 5.89 కోట్ల ఐటీఆర్ లు దాఖలు అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి గడువు పొడగించినందున 6 లక్షల మంది జరిమానాతో ఐటీఆర్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 19.53 లక్షలు దాఖలు అయ్యాయి. తదుపరి ప్రతి గంటలు 4 లక్షలకు పైగా.. సాయంత్రం 5, 6 గంటల మధ్య అత్యధికంగా 5.17 లక్షల ఐటీఆర్ లు దాఖలు అయ్యాయి. 



అపరాధ రుసుము తప్పనిసరి...


2021-22కు సంబంధించి అపరాధ రుసుము లేకుండా జులై 31లోగా ఐటీఆర్ లు దాఖలు చేయాలి. తదుపరి డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో దాఖలు చేయవచ్చు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు రూ.1000 అంతకు మించిన ఆదాయం గలవారు రూ.5000 చొప్పున అపరాధ రుసుము చెల్లించి ఐటీఆర్ దాఖలు చేయాలి.


వెబ్ సైట్‌లో లోపాలు ఇప్పటికీ సరిచేయలేదు


రిటర్నుల దాఖలుకు గడువు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఇప్పటికీ ఐటీ వెబ్ సైట్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేయకుండా గడువులోపు దరఖాస్తు చేయాలని ఒత్తిడి పెంచడం సరికాదని అంటున్నారు. రోజుకు కోటి మంది రిటర్నులు దాఖలు చేసినా పోర్టల్ లో ఎలాంటి సమస్యా ఉండదని తరుణ్ బజాజ్ పేర్కొనడం గమనార్హం. 


తేదీ పొడగించే అవకాశాలు తక్కువే..


ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ పొడగించే అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆడిట్ పరిధిలోకి వచ్చే వారు రిటర్నులు దాఖలు చేసేందుకకు అక్టోబర్ 31 దాకా సమయం ఉంటుంది. గడువు ముగిసే నాటికి మొత్తం రిటర్నుల సంఖ్య క్రితం అసెస్ మెంట్ ఏడాది స్థాయికి చేరే వీలు ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఈ గడువు పొడగించే అకాశం ఉందని అంటున్నారు.