Fridge AC Rates Hike: వచ్చే వేసవి కోసం మీరు ఒక కొత్త ఫ్రిజ్‌ లేదా ఏసీ కొనాలని భావిస్తున్నారా?, అయితే ఆ పనిని త్వరగా పూర్తి చేయండి. ఎందుకంటే, రిఫ్రిజిరేటర్లు ధరలు 2-5 శాతం వరకు - ఏసీల ధరలు 5-8 శాతం వరకు, ఫ్యాన్ల రేట్లు 7-8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. 


విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే 'బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ' (Bureau of Energy Efficiency - BEE), ఈ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు 'స్టార్ రేటింగ్' విషయంలో కొన్ని నిబంధనలు సవరించి, అమల్లోకి తేవడమే దీనికి కారణం. సవరించిన నిబంధనలు 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 


కొత్త నిబంధనలను అమలు చేయడం వల్ల... శామ్‌సంగ్‌ (Samsung) గోద్రెజ్ ‍‌అప్లయెన్సెస్ (Godrej Appliances), హైయర్ ‍‌(Haier), పానాసోనిక్ (Panasonic), ఎల్‌జీ (LG) వంటి కంపెనీల ఫ్రిజ్‌ల మీద, మోడల్ ఆధారంగా 2 నుంచి 5 శాతం అదనపు భారం పడవచ్చు.


స్టార్ లేబులింగ్ కోసం కొత్త నియమాలు
ఉపకరణాల సామర్థ్యం ఆధారంగా BEE స్టార్ రేటింగ్ ఇస్తుంది. 1 నుంచి 5 వరకు ఉండే స్టార్‌ రేటింగ్‌, విద్యుత్ వినియోగం పరంగా సంబంధిత వస్తువు ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో తెలియజేస్తుంది. 4 స్టార్‌, 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి. 


ప్రస్తుతం, ఈ స్టార్‌ లేబులింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. అంటే.. ఇప్పటి వరకు 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను ఇకపై 4 స్టార్‌ రేటింగ్‌కు మారుస్తారు. 5 స్టార్‌ ప్రమాణాలతో కొత్త ఉత్పత్తులను కంపెనీలు తయారు చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఫ్రాస్ట్ ఫ్రీ మోడళ్లలో ఫ్రీజర్ & రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్‌లకు వేర్వేరుగా 'స్టార్ లేబులింగ్' తప్పనిసరి చేశారు. 


ఫ్రిజ్‌ల విషయంలో ఇప్పటివరకు  స్థూల సామర్థ్యాన్ని ‍‌(Gross Capacity) ప్రకటిస్తుండగా, ఇకపై నికర సామర్థ్యాన్ని (Net Capacity) ప్రకటించాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్‌ తలుపు, షెల్ఫ్‌ల మధ్య ఖాళీలను ఉపయోగించుకోవడం కుదరదు కాబట్టి,  దానిని నికర సామర్థ్య లెక్కలోకి తీసుకోరు. ఫలితంగా ఫ్రిడ్జ్‌లు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులకు ఈ సమాచారం చాలా ఉపయోగంగా ఉంటుంది.


విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల ధరలు పెరగడం వల్ల ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ కంపెనీల మీద భారం పెరిగింది. ఇప్పుడు, కొత్త నిబంధనల ప్రకారం వస్తువులను ఉత్పత్తి చేయాల్సి రావడంతో, దాదాపు అన్ని కంపెనీలు ప్రొడక్ట్‌ రేట్లను పెంచనున్నాయి. 


కంపెనీ ప్రతినిధులు ఏం చెప్పారంటే..?
"ఇప్పుడు,  ఫ్రీజర్ & రిఫ్రిజిరేటర్ రెండింటికీ స్టార్ రేటింగ్ కింద లేబులింగ్ ప్రకటించాలి. ఇది కొత్త మార్పు. ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉన్నప్పుడు ఖర్చు కొంత పెరుగుతుంది. ధరలు రెండు నుంచి మూడు శాతం వరకు పెరగవచ్చు. ఇది వేర్వేరు మోడళ్లు, స్టార్ రేటింగ్‌ల మీద ఆధారపడి ఉంటుంది" అని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ & ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు.


BEE నిబంధనలు మారిన తర్వాత, కొన్ని కంప్రెషర్లను రీప్లేస్ చేయాల్సి ఉంటుందని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ చెప్పారు. ధరలు కచ్చితంగా రెండు నుంచి నాలుగు శాతం వరకు పెరగవచ్చని, ఆ భారం వినియోగదారులపై పడుతుందని అన్నారు. 


సవరించిన BEE నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత రిఫ్రిజిరేటర్ల ధరలు ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఫుమియాసు ఫుజిమోరి కూడా తెలిపారు. అయితే, పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగాన్ని కంపెనీయే భరించేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు.


స్టార్‌ రేటింగ్‌ ఉన్న సీలింగ్‌ ఫ్యాన్లనే ఈ నెల నుంచి దేశీయంగా తయారు చేసి, విక్రయించాల్సి ఉంది. ఇందువల్ల వీటి ధరలు కూడా 7-8 శాతం పెరిగే అవకాశం ఉంది.