Forex Reserves: రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఒక రిలీఫ్ న్యూస్ ప్రకటించింది. భారత విదేశీ మారక ద్రవ్య ‍‌నిల్వలు (forex reserves) మళ్లీ పుంజుకున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 6.3 బిలియన్ డాలర్లు పెరిగాయి, తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.


వరుసగా రెండో వారం ఉపశమనం
గత కొంతకాలంగా భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణిస్తూ వచ్చాయి. ఇప్పుడు, ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో వృద్ధితో పాటు, అంతకుముందు మార్చి 31తో ముగిసిన వారంలోనూ నిల్వలు పెరిగాయి. వరుసగా రెండు వారాల పాటు విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగడంతో, క్షీణతకు బ్రేక్ పడింది. 


ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్ ఎంత?
రిజర్వ్ బ్యాంక్ అధికారిక సమాచారం ప్రకారం, ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 6.3 బిలియన్ డాలర్లు పెరిగి 584.755 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు, మార్చి 31తో ముగిసిన వారంలో ఈ నిల్వ 578.45 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి, ఆ వారంలో 329 మిలియన్ డాలర్లు పెరిగాయి.


సమీక్షలో ఉన్న వారంలో, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) సుమారు 4.740 బిలియన్‌ డాలర్లు పెరిగి 514.431 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు అంటే.. విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. డాలర్ రూపంలో ఈ విలువను చెబుతారు.


వేగంగా పెరిగిన బంగారం నిల్వలు
ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో, భారతదేశం యొక్క బంగారం నిల్వలు (Gold reserves), SDRల (Special Drawing Rights) హోల్డింగ్ కూడా పెరిగింది. ఆ సమయంలో, గోల్డ్ రిజర్వ్స్‌ విలువ 1.496 బిలియన్‌ డాలర్లు పెరిగి 46.696 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ కూడా 58 మిలియన్ డాలర్లు పెరిగి 18.450 బిలియన్‌ డాలర్లకు చేరాయి. IMF (International Monetary Fund) వద్ద ఉంచిన నిల్వలు 13 మిలియన్‌ డాలర్లు పెరిగి 5.178 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.


ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల, ప్రధానంగా ప్రపంచ పరిణామాల కారణంగా ఏర్పడిన ఒత్తిళ్ల నుంచి రూపాయి విలువను రక్షించుకోవడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ డాలర్లను ఖర్చు చేయడం ప్రారంభించింది. దీంతో, సెంట్రల్ బ్యాంక్ కిట్టీలో నిల్వలు క్షీణించాయి. 


ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.