Foreign Portfolio Investors: ప్రపంచ మార్కెట్లను దాటి బ్రహ్మాండంగా ర్యాలీ చేస్తున్న ఇండియన్‌ మార్కెట్లను చూసి ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) తెగ ముచ్చట పడుతున్నారు. బుల్లిష్ బెట్స్‌ పెంచుతున్నారు. దీంతో, డొమెస్టిక్‌ ఇన్‌ ఫ్లోస్‌, ఫారిన్‌ ఇన్‌ ఫ్లోస్‌ కలిసి ఇండియన్‌ ఇండెక్స్‌లు కొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి.


ఒక ఏడాదిలో, వరుసగా ఆరు నెలల FPIల పెట్టుబడుల మొత్తం పాజిటివ్‌గా ఉండడం ఇదే తొలిసారి. 2022 నవంబర్‌ చివరి నాటికి ఈ మొత్తం ₹34,539 కోట్లకు ($4.14 బిలియన్లు) చేరింది. గత ఐదు నెలల్లో విదేశీ పెట్టుబడిదారులు $10 బిలియన్లు (₹84,799 కోట్లు) పెట్టుబడి పెట్టారు. అంతకుముందు 14 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే, ఈ ఆరు నెలల మొత్తమే అత్యధికం. ఇదే కాలంలో, అన్ని విదేశీ ఎమర్జింగ్‌ మార్కెట్ల కంటే ఇండియన్‌ మార్కెట్లోకి తెచ్చిందే గరిష్టం.


₹2 లక్షల కోట్ల స్థూల కొనుగోళ్లు
నవంబర్ 2022లో FPIల గ్రాస్‌ బయింగ్‌ ₹2 లక్షల కోట్లను దాటింది. గత 20 ఏళ్లలో, కేవలం ఐదు సందర్భాల్లో మాత్రమే FPI స్థూల కొనుగోలు ₹2 లక్షల కోట్లను దాటింది. ఈ రీడింగ్స్‌లో ఎక్కువ భాగం గత రెండేళ్లలోనే జరిగింది. గ్రాస్‌ బయ్‌/సేల్‌ రేషియో కూడా, దాని దీర్ఘకాలిక సగటు 1.07తో పోలిస్తే ఇప్పుడు 1.22కు చేరుకుంది. అంటే, 100 షేర్లు అమ్మితే, అదే సమయంలో 122 షేర్లను ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులు కొంటున్నారు. 


వాస్తవానికి, ప్రస్తుతం ఇండియా వాల్యూయేషన్‌ పీక్‌ స్టేజ్‌లో ఉంది. P/E రేషియో ఒక సంవత్సరం ఫార్వర్డ్ ఆదాయాలకు 19 రెట్లకు చేరింది. ఇది చాలా మంది పెట్టుబడిదారులకు అసౌకర్యవంత స్థాయి. అయినా, ఇండియన్‌ ఈక్విటీల్లో FPIలు తమ ఎక్స్‌పోజర్‌ పెంచడానికి రెండు కారణాలు ఉన్నాయి.


1. SIP రూట్‌లో రిటైల్ ఇన్‌ ఫ్లోస్‌ (అక్టోబర్‌లో నెలవారీ SIP ఇన్‌ ఫ్లో ₹13,000 కోట్లకు చేరుకుంది) వల్ల, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈక్విటీల కొనుగోళ్లను భారీగా పెంచాయి. ఫలితంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి భారతీయ ఈక్విటీలు ప్రపంచాన్ని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను అధిగమించి ర్యాలీ చేశాయి.


2. 2022లో స్థిరమైన పనితీరు వల్ల, MSCI EM ఇండెక్స్‌లో భారతదేశ వెయిటేజీ 16%కి దగ్గరగా పెరిగింది. దీని ఫలితంగా చాలా మంది పాసివ్‌ ఇన్వెస్టర్లు భారత స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెంచారు.


ఈ అన్ని కారణాల వల్ల నిఫ్టీ50 గత ఆరు నెలల్లో 13% పెరిగింది. ఎమర్జింగ్‌ మార్కెట్ల స్పేస్‌లో అగ్రాసనంలో కూర్చుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.