China - US Reciprocal Tariff War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన సుంకాల పెంపు ప్రకటన తర్వాత, డ్రాగన్ కంట్రీ చైనా కూడా బలం ప్రతిస్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 34 శాతం భారీ పన్నును (Reciprocal tariffs) ప్రకటించి చైనా ప్రతీకారం తీర్చుకుంది. అమెరికా యాక్షన్ - చైనా రియాక్షన్, తదనంతర పరిణామాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. భారతీయ స్టాక్ మార్కెట్‌కు ఇది బ్లాక్ మండే. ఈ రోజు (సోమవారం, 07 ఏప్రిల్ 2025) చవిచూసిన షేర్ల పతనం, చరిత్రలో అతి పెద్ద నష్టాల్లో ఒకటిగా నిలిచింది.
వాస్తవానికి, ట్రంప్ టారిఫ్‌లు ఒక్క చైనాకే పరిమితం కాలేదు, భారత్ సహా 60 దేశాలపై విధించారు. అయినప్పటికీ, అమెరికా ప్రధాన టార్గెట్ డ్రాగన్ కంట్రీ. చైనా చేపట్టిన ప్రతీకార చర్యల్లో... అరుదైన ఖనిజాలు, ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాల ఎగుమతిని నియంత్రించడం నుంచి ప్రపంచ వాణిజ్య సంస్థలో పిటిషన్ దాఖలు చేయడం వరకు ఉన్నాయి. బీజింగ్ అనేక అమెరికన్ కంపెనీల నుంచి దిగుమతులను నిలిపివేసింది, రెండు డజన్లకు పైగా కంపెనీలను వాణిజ్య నిషేధ జాబితాలో చేర్చింది.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటిది కాదు, యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఎన్నికైనప్పుడు ఇది ప్రారంభమైంది.
చైనా-అమెరికా సుంకాల శత్రుత్వం
మార్చి 2017: అధ్యక్షుడైన తర్వాత, అమెరికా వాణిజ్య లోటును తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా నిర్ణయించుకున్నారు. యాంటీ-డంపింగ్‌పై కఠినమైన సుంకాలను విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు.
ఏప్రిల్ 2017: బీజింగ్ పర్యటన సందర్భంగా, ట్రంప్- చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. చైనాతో అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడానికి అంగీకరించారు. ఈ సమయంలో, వాణిజ్య చర్చల కోసం 100 రోజుల ప్రణాళికపై పరస్పర ఒప్పందం కుదిరింది. కానీ ఈ చర్చలు అదే ఏడాది జులైలో విఫలమయ్యాయి.
ఆగస్టు 2017: అమెరికన్ మేధో సంపత్తిని చైనా దొంగిలించిందని ఆరోపిస్తూ అధ్యక్షుడు ట్రంప్ దర్యాప్తునకు ఆదేశించారు. ఒక సంవత్సరంలో దాదాపు 600 బిలియన్ డాలర్లు దొంగిలించిందని ఆరోపించారు.
జనవరి 2018: అమెరికా, తాను దిగుమతి చేసుకునే సౌర విద్యుత్‌పై దాదాపు 30 శాతం భారీ సుంకాన్ని విధించింది. ఇవి ఎక్కువగా చైనా నుంచి ఎగుమతి అయ్యేవి.
ఏప్రిల్ 2018: బీజింగ్ ప్రతీకార చర్య చేపట్టింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, తమలపాకులు, వైన్, స్టీల్ పైపులు వంటి వస్తువులపై 15 శాతం కస్టమ్స్ సుంకాన్ని చైనా విధించింది. పంది మాంసం, రీసైకిల్ చేసిన అల్యూమినియం, ఇతర ఆరు రకాల వస్తువులపై 25 శాతం పన్నును విధించింది. అదే నెలలో, మరిన్ని వసువులపై యూఎస్, చైనా ప్రతీకార సుంకాలు పెంచాయి.
జూన్-ఆగస్టు 2018: రెండు దేశాలు ఒకదానికొకటి సుంకాలు విధించుకోవడం వల్ల, అమెరికాలోకి దిగుమతి చేసుకునే దాదాపు $250 బిలియన్ల విలువైన చైనా వస్తువులు & చైనాలోకి దిగుమతి చేసుకునే దాదాపు $110 బిలియన్ల విలువైన US ఉత్పత్తులు ప్రభావితమయ్యాయి.
డిసెంబర్ 2018 - మే 2019: డిసెంబర్ 2018లో, కొత్త సుంకాలు & వాణిజ్య యుద్ధాన్ని నిలిపివేయడంపై వాషింగ్టన్ - బీజింగ్ ఒక ఒప్పందానికి రావడంలో విఫలమయ్యాయి. చర్చలు విఫలమైన తర్వాత, ట్రంప్ దాదాపు $200 బిలియన్ల విలువైన చైనా వస్తువులపై 25 శాతం సుంకం విధించారు.
మే 2019: చైనా టెక్నాలజీ కంపెనీ హువావే నుంచి అమెరికన్ కంపెనీలు వస్తువులు కొనుగోలు చేయకుండా వాషింగ్టన్ నిషేధించింది.
జూన్ 2019: ట్రంప్ - జి జిన్‌పింగ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు & వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి అంగీకరించారు. కానీ తరువాతి ఐదు నెలల్లో పరిస్థితులు మారాయి, కొత్త సమస్యలు తలెత్తాయి.
ఇప్పుడు, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత, పాత పరిపాలనాశైలిని మరింత కఠినంగా మార్చారు.