Nirmala Sitharaman on Crypto:
క్రిప్టో కరెన్సీ నియంత్రణకు ఒక్క దేశమే కష్టపడితే సరిపోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ వర్చువల్ కరెన్సీ అంతా సాంకేతికత ఆధారంగానే నడుస్తుండటంతో ఒంటరిగా పనిచేయడం కష్టమన్నారు.
'క్రిప్టో కరెన్సీ, క్రిప్టో మైనింగ్, క్రిప్టో లావాదేవీలన్నీ సాంకేతికత ఆధారంగానే నడుస్తాయి. వీటి నియంత్రణ, నిర్వహణ ఒక్క దేశానికే సాధ్యమవ్వవు. అలా చేయడం వల్ల అనుకున్న ఫలితం రాదు' అని ఆర్థిక మంత్రి లోక్‌సభలో పేర్కొన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు క్రిప్టో కరెన్సీని కఠినంగా నిషేధించాలని ఎప్పట్నుంచో చెబుతోంది. దానివల్ల జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు ముప్పుందని వాదిస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక నిర్ణయానికి రాలేదు.
క్రిప్టో ఆస్తుల నియంత్రణ, ప్రామాణిక నిర్వహణ ప్రొటొకాల్ రూపొందించేందుకు జీ20 దేశాలతో భారత్ చర్చిస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నిదేశాలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటే సరైన ఫలితం వస్తుందని పేర్కొన్నారు.
క్రిప్టో నియంత్రణపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న వార్తల నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏక పక్షంగా క్రిప్టో ఆస్తులపై నిషేధం విధించాలని ఆర్బీఐ చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
బ్యాంకులు క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేపట్టడాన్ని 2018లో ఆర్బీఐ నిషేధించింది. అయితే ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ వేయడంతో సుప్రీం కోర్టు ఆ నిర్ణయాన్ని అడ్డుకుంది.
Shaktikanta Das on Crypto:
ప్రైవేటు క్రిప్టో కరెన్సీలతోనే తర్వాతి ఆర్థిక సంక్షోభం సంభవిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. వాటిని నిషేధించాలన్న మాటకే తాను కట్టబడి ఉంటానని స్పష్టం చేశారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్‌ఎస్‌ఐ ఇన్‌సైట్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. క్రిప్టో కరెన్సీలకు ఎలాంటి చట్టబద్ధత, అండర్ లైయింగ్ విలువ ఉండదని వెల్లడించారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, స్థిరత్వానికి ఇవి చేటు చేస్తాయని కుండబద్దలు కొట్టారు.
క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ ఎప్పట్నుంచో కఠినంగా వ్యవహరిస్తోంది. వాటిని నిషేధించాలని గవర్నర్ శక్తికాంత దాస్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. కరెన్సీగా వాటికి చట్టబద్ధత కల్పిస్తే ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని హెచ్చరించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. క్రిప్టో కరెన్సీతో పోరాడేందుకే ఆర్బీఐ సొంతంగా డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చింది. ప్రస్తుతం నాలుగు నగరాల్లో డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
డిజిటల్ కరెన్సీలపై సంపూర్ణ సమాచారం లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ.రవి శంకర్ ఈ మధ్యే అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉందని, వీటి గురించి అవగాహన కలిగించేందుకు సరైన నిబంధనలు రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. క్రిప్టో నియంత్రణకు బోర్డులో ఏక విధాన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని తెలిపారు.
'పూర్తి స్థాయిలో డేటా లేదు. ఇప్పుడున్న సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉంది. పూర్తి డేటా లేకుండా నియంత్రణ, నిబంధనలు రూపొందిస్తే రోగం ఒకటైతే మందు మరొకటి ఇచ్చినట్టు అవుతుంది' అని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సమావేశంలో రవిశంకర్ అన్నారు. పరిష్కారం కోసం సరైన, నమ్మదగిన సమాచారం సేకరించాల్సి ఉందన్నారు.