Flipkart Reveals Magic Ink Newspaper Ad: ఇది డిజటల్ ప్రపంచం. ప్రజలు చాలా పనుల కోసం డిజిటల్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు. పెద్ద కంపెనీలు కూడా ప్రింట్ మీడియా కంటే డిజిటల్ మీడియంలోనే ఎక్కువగా యాడ్స్ ఇస్తున్నాయి. ఈ డిజిటల్ ప్రకటనల ప్రపంచంలో, ఒక వార్తాపత్రికలో వచ్చిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా పాఠకుల మనస్సులు దోచింది. ఆ పేపర్ యాడ్‌ను ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఇచ్చింది. ముంబై, దిల్లీ, బెంగళూరు అంతటా ఆదివారం ఎడిషన్‌లలో ఈ యాడ్ కనిపించింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెటింగ్ & మీడియా హెడ్ ప్రతీక్ శెట్టి ఈ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యాడ్‌లో విశేషం ఏంటి?
ఈ పేపర్ యాడ్‌లో, ఒక ఇంటి డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. ఒక బాలుడు డైనింగ్ టేబుల్ దగ్గర, మరో వ్యక్తి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ఉంటారు. డైనింగ్ టైబుల్ దగ్గరకు వచ్చిన మహిళ చేయి తగిలి, ఆ బల్లపై ఉన్న పాలు ఒలికి అక్కడ కూర్చున్నవాళ్ల మీద, ఫ్లోర్ మీద పడినట్లు యాడ్ ఉంటుంది. ఇక్కడితో ఆగిపోతే ఇది అర్ధంపర్ధం లేని సాధారణ పేపర్ ప్రకటన అయ్యేది. కానీ, ఇక్కడి నుంచే మ్యాజిక్ మొదలవుతుంది. ఆ పేపర్ ప్రకటనలో ఏముందంటే... "పాలు ఒలికిపోయాయని బాధ పడకండి. ఆ పాల మీద తడితో రుద్దండి, ఇక చూడండి ఏం జరుగుతుందో?" అని ఉంది.
పాఠకులు ఆ పాలపై తడి చేతులతో, తడి బట్టతో తుడిచి ఆశ్చర్యపోయారు. కారణమేంటంటే... తడి పెట్టి తుడవగానే అక్కడ పాలు మాయమై కొంత సమాచారం కనిపించింది. అలా.. ఒలికిన పాలను పూర్తిగా తడవగానే ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన యాడ్ మొత్తం కనిపించింది. ఫ్లిప్‌కార్ట్ మ్యాజిక్ ఇంక్‌ను ఉపయోగించి ఆ యాడ్‌ను తయారు చేయించింది.
"మేము మీ మార్నింగ్ న్యూస్‌పేపర్ మీద నీరు పోయమని అడిగే స్థితికి చేరుకున్నాం. చివరి నిమిషపు అవసరాలకు భయపడాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సినవన్నీ నిమిషాల్లో డెలివరీ అవుతాయి" అని తన లింక్డ్‌ఇన్‌లోని పోస్ట్‌లో ప్రతీక్ శెట్టి రాశారు.
ఎలాంటి ఇంక్ వినియోగించారు?
పాఠకులను ఆకర్షించడానికి, విచిత్రమైన అనుభవాన్ని సృష్టించడానికి ఫ్లిప్‌కార్ట్ ఈ వినూత్న విధానం అనుసరించింది. ఈ ప్రకటనలో ప్రత్యేకమైన "హైడ్రో-క్రోమిక్ స్క్రీన్ ప్రింటింగ్ ఇంక్"ను వినియోగించారు. దీనిని తడి చేసి ఆరబెట్టినప్పుడు దానిలో రహస్యంగా దాగివున్న వివరాలను వెల్లడిస్తుంది.
ఈ ప్రత్యేకమైన ప్రకటన వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ ప్రచారం సృజనాత్మకత & అద్భుతంగా ఉందని అభినందించారు. ఈ ప్రకటనకు జీవం పోసిన చిత్రకారుడు లేదా విజువల్ డిజైనర్ గురించి ప్రస్తావించకపోవడంపై కొద్దిమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్లిప్‌కార్ట్ వంటి డిజైన్-ఆధారిత కంపెనీకి అలాంటి గుర్తించడం ఒక ప్రమాణంగా ఉండాలని సూచించారు.
మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్ రష్, సిల్వర్ షైనింగ్' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ