Financial Year End: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మరికొన్ని రోజుల్లోనే ఆర్థిక ఏడాది పూర్తవుతుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, చాలా ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తి చేయడానికి మార్చి 31వ తేదీ కీలకమైన, ఆఖరి గడువు. ఈ నెలాఖరులోగా ఆయా పనులను పూర్తి చేయడంలో విఫలమైతే, ఆ ప్రభావం నేరుగా జేబుపై పడుతుంది. 


మీరు బ్యాంకు పథకాల్లో గానీ, పోస్ట్‌ ఆఫీసు పథకాల్లో గానీ, షేర్‌ మార్కెట్‌లో గానీ పెట్టుబడులు పెట్టినా, మీకు LIC పాలసీ ఉన్నా.. ఈ క్రింది 7 పనులను మార్చి 31వ తేదీ లోగా కచ్చితంగా పూర్తి చేయాలి. లేకపోతే ఆ తర్వాత ఆయా ఖాతాల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 


మార్చి 31లోపు పూర్తి చేయాల్సిన ఏడు ముఖ్యమైన పనులు:


1. పాన్ & ఆధార్ నంబర్‌ లింక్: మార్చి 31 లోపు మీ పాన్ & ఆధార్ కార్డ్‌ నంబర్‌ను లింక్ చేయాలి. పాన్‌ - ఆధార్‌ నంబర్‌ అనుసంధానాన్ని (PAN and Aadhaar card Link) ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలంటే మీరు రూ. 1,000 చెల్లించాలి. నిర్లక్ష్యం చేసి, దీనిని వదిలేస్తే లేకపోతే పాన్ డీయాక్టివేట్‌ అవుతుంది. అప్పుడు మీరు ఎలాంటి ఆర్థిక సంబంధ లావాదేవీ చేయలేరు. పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయడానికి జరిమానాగా రూ. 10,000 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, రూ. 1000తో పోయేదానికి అందుకు పదింతల (రూ. 10,000) నష్టం తెచ్చిపెట్టుకోవద్దు.


2. పన్ను ఆదా పథకాలలో పెట్టుబడులు పెట్టండి: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను ఆదా ‍‌(tax saving) చేయడానికి మీకు ఉన్న గడువు మార్చి 31వ తేదీ. పన్ను ఆదా కోసం పోస్ట్ ఆఫీస్ పథకాలు, NPS, హోమ్ లోన్, మ్యూచువల్ ఫండ్స్, PPF, సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ పని పూర్తి చేసి ఆదాయ పన్ను ప్రయోజనాలను పొందండి.


3. మ్యూచువల్ ఫండ్ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి: SEBI (సెక్యూరిటీస్‌ అండ్ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) సర్క్యులర్ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వాళ్లు మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను (mutual fund nomination process) పూర్తి చేయాలి. ఈ గడువులోగా, మీ ఖాతాలో నామినీ పేరును జత చేయకపోతే మీ ఖాతాను స్తంభింపజేస్తారు.


4. డీమ్యాట్‌ ఖాతా నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి: స్టాక్‌ మార్కెట్‌ రెగ్యులేటర్ సెబీ సర్క్యులర్ ప్రకారం, డీమ్యాట్‌ ఖాతా ఉన్న వాళ్లు కూడా మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను (demat account nomination process) పూర్తి చేయాలి. ఈ గడువులోగా, మీ ఖాతాలో నామినీ పేరును జత చేయకపోతే మీ డీమ్యాట్‌ ఖాతాను స్తంభింపజేస్తారు.


5. NSE NMF ప్లాట్‌ఫామ్‌లో మొబైల్ నంబర్ & ఈ-మెయిల్ IDని ధృవీకరించండి: మార్కెట్ రెగ్యులేటర్ ఆదేశం ప్రకారం, 2023 మార్చి 31లోపు NSE NMF ప్లాట్‌ఫారమ్‌లో మీ మొబైల్ నంబర్‌ను, ఈ-మెయిల్ IDని ధృవీకరించడం తప్పనిసరి.


6. PPFకి రూ. 500 బదిలీ చేయండి: మీకు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఖాతా (Public Provident Fund Account) ఉంటే ఇది మీ కోసమే. ఒక ఆర్థిక సంవత్సరంలో PPF ఖాతాకు కనీసం రూ. 500 బదిలీ చేయాలి. మీరు ఇప్పటికీ ఆ పని చేయకపోతే, మార్చి 31లో బదిలీ పూర్తి చేయండి. లేదా, ఏప్రిల్ 1 నుండి మీ ఖాతాను నిష్క్రియం ‍‌(deactivation) చేస్తారు.


7. LIC పాలసీని పాన్‌తో లింక్‌ చేయాలి: పాలసీ కొనుగోలుదార్లు తమ LIC పాలసీని పాన్‌ కార్డ్‌తో లింక్ చేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‍‌(LIC) సూచించింది. లేకపోతే, ఆ LIC పాలసీకి సంబంధించి భవిష్యత్‌లో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఇప్పటి వరకు మీ LIC పాలసీని పాన్‌తో లింక్ చేయకపోతే, ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాన్‌ అనసంధానం పూర్తి చేయవచ్చు. ఇప్పటికే మీరు ఈ పని చేస్తే, దాని స్థితిని (Status) కూడా తెలుసుకోవచ్చు. 


ఎలాంటి ఆర్థిక జరిమానాలు లేదా ఖాతా డీయాక్టివేషన్‌ లేకుండా ఉండాలంటే ఈ పనులను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయండి.