Financial Rules To Change From 1st January 2023: మరికొన్ని రోజుల్లో 2022 సంవత్సరం ముగుస్తుంది, కొత్త సంవత్సరం 2023 ప్రారంభం అవుతుంది. ఈ మార్పు కేలండర్‌కు మాత్రమే సంబంధించింది కాదు. పాత సంవత్సరంతో పాటు... మీ బ్యాంక్, ఫైనాన్స్‌కు సంబంధించిన అనేక విషయాలు మారబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ జేబులోని డబ్బు మీద ప్రభావం చూపుతాయి. 


క్రెడిట్ కార్డ్ (Credit Card), బ్యాంక్ లాకర్ (Bank Locker), జీఎస్టీ ఈ-ఇన్వాయిసింగ్‌ ‍‌(GST E-Invoicing), సీఎన్‌జీ & పీఎన్‌జీ ధరలు (CNG-PNG Price), వాహనాల ధరలు వంటి 2023 జనవరి 1వ తేదీ నుంచి మారబోతున్నాయి. ఈ విషయాల మీద మీకు ముందుగా అవగాహన లేకపోతే, నూతన ఏడాదిలో మీ సొమ్మును అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.


2023 జనవరి 1 నుంచి మారే ఆర్థిక విషయాలు:


1. బ్యాంక్ లాకర్ కొత్త నియమాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన కొత్త లాకర్ నియమాలు జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తాయి. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత, లాకర్ విషయంలో బ్యాంకర్లు తమ ఖాతాదారులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరదు. లాకర్‌లో ఉంచిన వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే, ఇకపై బ్యాంకులు బాధ్యత తీసుకుని, పరిష్కరించాల్సి ఉంటుంది. దీని గురించి, లాకర్ వినియోగదారులు 2022 డిసెంబర్ 31 లోగా బ్యాంకుతో ఒప్పందం మీద సంతకం చేయాలి.


2. క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో మార్పు
జనవరి 1, 2023 నుంచి, కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో మార్పులు వస్తాయి. HDFC బ్యాంక్, తన క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపులపై అందుకున్న రివార్డ్ పాయింట్ల నియమాలను మార్చబోతోంది. SBI కార్డ్స్‌ కూడా, కొన్ని క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా ఇప్పటి వరకు అందిస్తున్న రివార్డ్‌ పాయింట్లను కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి తగ్గించబోతోంది.


3. GST ఈ-ఇన్వాయిసింగ్‌ నిబంధనల్లో మార్పులు
కొత్త సంవత్సరం నుంచి జీఎస్టీ ఈ-ఇన్‌వాయిసింగ్ లేదా ఎలక్ట్రానిక్ బిల్లు నిబంధనల్లో పెద్ద మార్పు రానుంది. GST ఈ-ఇన్‌వాయిస్ కోసం ప్రస్తుతం ఉన్న రూ. 20 కోట్ల వ్యాపార పరిమితిని రూ. 5 కోట్లకు భారత ప్రభుత్వం తగ్గించింది. ఈ కొత్త నిబంధనను జనవరి 1, 2023 నుంచి అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో, రూ. 5 కోట్లకు పైగా వ్యాపారం చేసే వ్యాపారులు/ సంస్థలు ఇకపై ఎలక్ట్రానిక్ బిల్లులను రూపొందించుకోవాల్సి ఉంటుంది.


4. వంట గ్యాస్‌ (LPG) ధర మార్పు
కొత్త సంవత్సరం ప్రారంభంలోనే LPG ధర గురించి ప్రభుత్వం ఒక శుభవార్త ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ చమురు కంపెనీలు (Oil Marketing Companies) కొత్త సంవత్సరంలో వంట గ్యాస్ ధరల తగ్గింపును ప్రకటించవచ్చని అంతా భావిస్తున్నారు. గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి, LPG గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించేలా ప్రభుత్వ చమురు కంపెనీలకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించవచ్చు.


5. కారు ధర మరింత ఖరీదు కావచ్చు
మీరు 2023 సంవత్సరంలో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీకు నిరాశ కలిగించవచ్చు. MG మోటార్, మారుతి సుజుకీ, హోండా, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మెర్స్‌డెజ్‌ బెంజ్‌, ఆడి, రేనాల్ట్‌ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తమ వాణిజ్య వాహనాల ధరలను 2023 జనవరి 2వ తేదీన పెంచబోతున్నట్లు ఇప్పటికే టాటా మోటార్స్ ప్రకటించింది. హోండా కార్స్ కూడా తన వాహనాల ధరలను రూ. 30,000 వరకు పెంచాలని నిర్ణయించింది.