DGCA Air Ticket Rule: విమాన ప్రయాణీకులు బుక్‌ చేసుకున్న టిక్కెట్లను విమానయాన సంస్థలు ఒక్కోసారి డౌన్‌గ్రేడ్ చేస్తుంటాయి. అంటే, ఒక తరగతిలో (ఫస్ట్‌క్లాస్‌, బిజినెస్‌ క్లాస్‌, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్‌) టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే, చెక్‌ ఇన్‌ సమయానికి దానిని కింది తరగతికి మారుస్తుంటాయి. ఇదేంటని అడిగితే..  సీట్లు లేవనో, విమానం మారిందనో, బుకింగ్స్‌ అధికంగా ఉన్నాయనో విమాన సంస్థ సిబ్బంది చెబుతుంటారు. చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురై ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో విమాన సిబ్బందికి, ప్రయాణీకుల మధ్య గొడవులు కూడా వస్తుంటాయి. కింది తరగతి మారడం ఇష్టం లేని వాళ్లు ప్రయాణాలను రద్దు చేసుకుంటే, తప్పక వెళ్లాల్సిన వాళ్లు కింది తరగతిలోనే ప్రయాణం చేస్తారు.


విమానయాన సంస్థలు ప్రయాణీకులను బోర్డింగ్‌కు నిరాకరించడం, విమానాలను రద్దు చేయడం, విమానాలు ఆలస్యం అయినప్పుడు విమానయాన సంస్థలు అందించాల్సిన సౌకర్యాలు వంటి వాటి మీద, పౌర విమానయాన నియమాలను (Civil Aviation Regulations) DGCA ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా నిబంధనలు సవరిస్తూ, అవి అమలయ్యేలా చూస్తూ ఉంటుంది.


తమ ప్రమేయం లేకుండా, తమ టిక్కెట్‌ను విమానయాన సంస్థలు కింది తరగతికి మార్చాయంటూ విమాన ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరుగుతుండడంతో, DGCA (Directorate General of Civil Aviation) దీని మీద కూడా దృష్టి సారించింది. 


తరగతి మార్పుపై DGCA ఏం చేస్తుంది?
ప్రయాణీకులు తరచూ ఇస్తున్న ఫిర్యాదుల గురించి, అన్ని దేశీయ విమానయాన సంస్థలు & సంబంధిత వర్గాలతో DGCA చర్చలు జరపనుంది. ప్రయాణీకుల సమస్యలకు పరిష్కారం కోసం కొత్త నిబంధనల మీద ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. దేశీయ విమానయాన సంస్థలు & సంబంధిత వర్గాలతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించి, తాను రూపొంచిందిన కొత్త నిబంధనను చర్చకు పెట్టనుంది. అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం... "ఒక ప్రయాణీకుడు బుక్ చేసిన టికెట్ తరగతి నుంచి అతన్ని డౌన్‌గ్రేడ్‌ చేస్తే, పన్నులతో సహా టికెట్ పూర్తి విలువను వాపసు రూపంలో ప్రయాణీకుడికి సదరు విమానయాన సంస్థ చెల్లించాలి. దీంతోపాటు, అందుబాటులో ఉన్న తర్వాతి తరగతిలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించాలి" అన్నది DGCA తీసుకురాబోతున్న కొత్త రూల్స్‌. సంబంధిత వర్గాలతో పూర్తి స్థాయి చర్చల తర్వాత, తుది నిబంధనను DGCA జారీ చేస్తుంది. వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి నెల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.


అన్ని విమానయాన సంస్థలకు నిబంధనలు వర్తింపు
భారత్ నుంచి నడిచే అన్ని విమానయాన సంస్థలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని DGCA ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ తెలిపారు. "సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్‌ (CAR) సెక్షన్-3 ప్రకారం, టిక్కెట్‌ల డౌన్‌గ్రేడ్ వల్ల ప్రభావితమయ్యే విమాన ప్రయాణికుల హక్కులను పరిరక్షించే ప్రక్రియలో విమానయాన రెగ్యులేటర్ ఉంది. కొత్త రూల్స్‌ను ప్రకటించే ముందు, సంబంధిత వాటాదారుల సంప్రదింపుల ద్వారా ఈ ప్రక్రియ ముందుకు వెళ్లాలి. ఈ ప్రతిపాదన మీద, రాబోయే 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలను కూడా ఆహ్వానిస్తాం. భారత దేశంలోని విమానయాన సంస్థలు బిజినెస్ క్లాస్ టిక్కెట్‌ ప్రయాణీకులను ఎకానమీ క్లాస్‌కు ఎక్కువగా డౌన్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో, ఈ మార్పులు చేయాలనే ప్రతిపాదన వచ్చింది" అని అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు.