Financial Rules Changing from 01 May 2024: ఈ రోజు (01 మే 2024) నుంచి కొత్త నెల ప్రారంభమైంది. కొత్త నెలతో పాటే డబ్బుకు సంబంధించిన చాలా కీలక విషయాల్లో మార్పులు వచ్చాయి. బ్యాంక్ ఛార్జీల నుంచి గ్యాస్ సిలిండర్ రేటు వరకు చాలా విషయాల్లో సవరణలు జరిగాయి. వాటి గురి నేరుగా మీ జేబుపైనే ఉండొచ్చు, మీ ఇంటి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేయొచ్చు.
మే 01 నుంచి మారిన విషయాలు:
ఈ రోజు (మే 01) నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 19 రూపాయల చొప్పున తగ్గింది. ఇంట్లో వంటకు ఉపయోగించే దేశీయ గ్యాస్ సిలిండర్ రేటులో ఎలాంటి మార్పు లేదు.
మీకు ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటే, ఇది మీ కోసమే. ఈ ప్రైవేట్ బ్యాంక్, తన సేవింగ్స్ అకౌంట్ నిబంధనలను మార్చింది. డెబిట్ కార్డ్ లావాదేవీలపై గ్రామీణ ప్రాంతాల్లో రూ.99, పట్టణ ప్రాంతాల్లో రూ.200 రూపాయలు వార్షిక రుసుమును (Annual fee) బ్యాంక్ వసూలు చేస్తుంది. చెక్ బుక్ ఛార్జీలు, IMPS సహా మరికొన్ని సేవా రుసుములను కూడా బ్యాంక్ సవరించింది. ఈ మార్పులు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి.
యెస్ బ్యాంక్ కూడా పొదుపు ఖాతా నిబంధనల్లో కొత్త విషయాలు చేరాయి. వివిధ సేవింగ్స్ అకౌంట్స్‌లో కనీస సగటు నిల్వ (Minimum Average Balance) పరిమితి నేటి నుంచి మారింది. క్రెడిట్ కార్డ్ రూల్స్‌ను కూడా ఈ బ్యాంక్ మార్చింది. ఇప్పుడు, రూ.15,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులపై 1 శాతం GST చెల్లించాలి. ఇంధన ఆధారిత క్రెడిట్ కార్డ్ రుసుములు కూడా ప్రభావితం అవుతాయి.
IDFC ఫస్ట్ బ్యాంక్ నిబంధనల్లోనూ సవరణలు జరిగాయి. ఈ బ్యాంక్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులకు సంబంధించి కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇప్పుడు, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.20,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లిస్తే, ఖాతాదార్లు 18 శాతం GST, మరో 1 శాతం అదనపు ఛార్జీ చెల్లించాలి.
HDFC బ్యాంక్, ప్రత్యేక FD గడువును పెంచింది. వృద్ధుల కోసం అమలు చేస్తున్న "HDFC సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్" పథకం చివరి తేదీని ఈ నెల 10వ తేదీ వరకు బ్యాంక్ పొడిగించింది. ఈ స్కీమ్‌ను కేవలం సీనియర్ సిటిజన్ల కోసమే. బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం... ఈ FD అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లు, సాధారణ కస్టమర్ల కంటే 0.75 శాతం ఎక్కువ వడ్డీ ఆదాయం పొందొచ్చు. 5 నుంచి 10 సంవత్సరాల టెన్యూర్‌తో డిపాజిట్ చేస్తే, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. ఈ FDలో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేసే వెసులుబాటు ఉంది.
మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో.. రెండు & నాలుగు శనివారాలు, 4 ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.
ఇప్పటికీ ఆధార్ - పాన్ లింక్ (Aadhaar-PAN Link) చేయనివాళ్లకు ఆదాయ పన్ను విభాగం మరో ఛాన్స్ ఇచ్చింది. ఈ రెండు కీలక గుర్తింపుకార్డుల అనుసంధానం కోసం ఈ నెలాఖరు (మే 31) వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా ఆధార్ - పాన్ లింక్ చేసిన వ్యక్తుల నుంచి అదనంగా TDS/TCS వసూలు చేయరు.
మరో ఆసక్తికర కథనం: మళ్లీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర - మీ ప్రాంతంలో ఈ రోజు రేటు ఇది