FIIs: ఈ క్యాలెండర్ సంవత్సరంలో మొదటి రెండు నెలల పాటు ఇండియన్ ఈక్విటీల్లో నికర అమ్మకందార్లుగా ఉన్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (FIIs), Q4FY23 ఆదాయాల సీజన్ ప్రారంభానికి ముందు, మార్చి నెలలో రూటు మార్చారు. ఆ నెలలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన (రూ. 7,936 కోట్లు) షేర్లను కొని, నికర కొనుగోలుదార్లుగా మారారు.
మార్చి నెలలో ఎఫ్‌ఐఐల ఆసక్తి వీటి మీద..
గత నెలలో FIIల షాపింగ్ జాబితాలో... సర్వీసెస్ (రూ. 7,246 కోట్లు), పవర్ (రూ. 3,214 కోట్లు), మెటల్స్ & మైనింగ్ (రూ. 2,938 కోట్లు), ఆటో (రూ. 2,695 కోట్లు), క్యాపిటల్ గూడ్స్ (రూ. 2,507 కోట్లు), కన్‌స్ట్రక్షన్ (రూ. 2,224 కోట్లు), FMCG (రూ. 1,765 కోట్లు), కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ (రూ. 1,423 కోట్లు), కెమికల్స్ (రూ. 280 కోట్లు), కన్జ్యూమర్ డ్యూరబుల్స్ (రూ. 261 కోట్లు), రియాల్టీ (రూ. 104 కోట్లు) వరుసగా ఉన్నాయి.
మార్చి నెలలో ఎఫ్‌ఐఐలు వదిలించుకుంది వీటినే..
మార్చి నెలలో రూ. 6,910 విలువైన ఐటీ స్టాక్స్‌ను ఓవర్సీస్ ఇన్వెస్టర్లు విక్రయించారు. దీనిని ఒక సిగ్నల్‌గా తీసుకుంటే.. మార్చి త్రైమాసికం ఫలితాల్లో ఐటీ స్టాక్స్ నిరాశపరచవచ్చు. ఆయిల్ & గ్యాస్ (రూ. 6,824 కోట్లు), హెల్త్‌కేర్ (రూ. 1,587 కోట్లు) నుంచి కూడా డాలర్లు బయటకు వెళ్లిపోయాయి.
మార్చి త్రైమాసికంలో ఆరోగ్యకరమైన ఆదాయ వృద్ధిని నివేదించగలవని అంచనా వేస్తున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ నుంచి కూడా రూ. 556 కోట్ల విలువైన పెట్టుబడులు బయటకు వెళ్లాయి. వీటితో పాటు... టెలికాం (రూ. 459 కోట్లు), టెక్స్‌టైల్స్ (రూ. 336 కోట్లు), మీడియా (రూ. 318 కోట్లు) నుంచి కూడా విదేశీయులు తమ డబ్బును వెనక్కు తీసుకున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా, వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో FIIలు నెట్ సెల్లర్స్‌గా ఉన్నారు. NSDL డేటా ప్రకారం, FY22లో రూ. 1.22 లక్షల కోట్లు, FY23లో రూ. 41,000 కోట్ల విలువైన షేర్లను నికరం అమ్మారు.
పెట్టుబడిదార్లు ఇప్పుడేం చేయాలి?
Q4 ఆదాయాల సీజన్‌ను BFSI (Banking, Financial Services and Insurance), ఆటో స్టాక్స్ ముందుకు నడిపించవచ్చని.. మెటల్స్, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ వెనక్కు లాగవచ్చని దలాల్ స్ట్రీట్ ఆశిస్తోంది.
ఐటీ సర్వీసెస్ విషయంలో.. మార్చి త్రైమాసికంలో కాలానుగుణ బలహీనత సాధారణంగా కనిపిస్తుంది. దీంతోపాటు, ఆర్థిక మాంద్యం భయంతో విచక్షణాధార ఖర్చులు తగ్గడం, డిమాండ్ క్షీణత వంటి అంశాలూ కూడా ఐటీ కంపెనీల వృద్ధిపై ప్రభావం చూపుతాయన కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది.
దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్... ఫైనాన్షియల్స్, క్యాపెక్స్, ఆటో రంగాల మీద "ఓవర్‌వెయిట్" వైఖరిని కొనసాగించింది, కన్‌జంప్షన్‌ను "ఓవర్‌వెయిట్"కు అప్‌గ్రేడ్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.