FED Interest Rate:
అమెరికా ఫెడరల్ రిజర్వు (US Fed) మరోసారి కీలక వడ్డీరేట్లను సవరించింది. బుధవారం 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచింది. చివరి 12 సమావేశాల్లో ఫెడ్ విధాన రేట్లను పెంచడం (US Fed Rate Hike) ఇది పదకొండో సారి. 2007 హౌజింగ్ మార్కెట్ క్రాష్ స్థాయి అయిన 5.25-5.50 శాతానికి వడ్డీరేట్లు చేరుకున్నాయి. 22 ఏళ్లలో తొలిసారి అమెరికా ప్రజలు ఇలాంటి పెంపును చూశారు. ఇక రాబోయే రోజుల్లో ఆర్థిక సమాచారం, నిరుద్యోగ గణాంకాలను బట్టి పెంపును కొనసాగించాలా తాత్కాలికంగా నిలిపివేయాలో పరిశీలిస్తామని ఫెడ్ తెలిపింది.
'ఫెడరల్ మార్కెట్ కమిటీ మానిటరీ పాలసీ కోసం నిరంతరం అదనపు సమాచారం పరిశీలిస్తూనే ఉంటుంది' అని ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ అన్నారు. పెంపును నిలిపివేసే దశ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మరోసారి వడ్డీరేట్ల పెంపు ఉంటుందో, నిలిపివేస్తామో చూసేందుకు సెప్టెంబర్ సమావేశం వరకు ఆగాల్సి ఉందన్నారు. ద్రవ్యోల్బణం తగ్గి, ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటే పెంపును నిలిపివేస్తామన్నారు.
విధాన రేటును నిర్ణయించేందుకు సెంట్రల్ బ్యాంకు పూర్తిగా రాబోయే డేటాపైనే ఆధారపడిందని పావెల్ అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిగువ స్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం పడిపోవాలంటే ఇదే తప్పనిసరని వెల్లడించారు. రెండు శాతం దిగువకు ఇన్‌ఫ్లేషన్‌ను తీసుకొచ్చేందుకు వీలైనంత కష్టపడుతున్నామని తెలిపారు. నిరుద్యోగ రేటు 3.6 శాతం, ఎకానమీ 1.8 శాతం మీదే ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం జరగకుండానే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందన్నారు.
జూన్ 13-14 నాటి సమావేశం తర్వాత విడుదలైన డేటా రేట్ల తగ్గింపుకు అనుకూలంగానే ఉన్నా ఫెడ్ ఆ పని చేయలేదు. దూకుడుగానే వ్యవహరించింది. అవసరమైతే మరోసారీ రేట్ల పెంపునకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చింది. యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు తర్వాత అమెరికా ట్రెజరీ యీల్డ్ కొంత తగ్గింది. స్టాక్ మార్కెట్లు సైతం ఫ్లాట్‌గానే ముగిశాయి. 'ద్రవ్యోల్బణాన్ని రెండు శాతం లోపునకు తీసుకురావాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కొంత రెసెషన్‌లోకి వెళ్లాలి. లేదంటే వృద్ధిరేటు తగ్గాలి. వచ్చే ఏడాదీ రెసెషన్ లేదంటే ద్రవ్యోల్బణం రెండు శాతానికి రాబోదనే అర్థం' అని సిటీబ్యాంకు ఆర్థిక వేత్త వెరోనికా క్లార్క్ అన్నారు.
Also Read: వంటింటి మంట నుంచి ఉపశమనం, ఆయిల్ రేట్లు భారీగా తగ్గాయి!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు (Mutual Funds), స్టాక్ మార్కెట్ (Stock Market), క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial