Elon Musk Tweet: వర్చువల్ కరెన్సీలో బిట్‌కాయిన్‌ను మించిది లేదు! ఒక బిట్‌కాయిన్ విలువ ఇప్పుడు రూ.30 లక్షల వరకు ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, కరెన్సీలకు ఇప్పుడిది ప్రత్యామ్నాయంగా మారుతోంది! దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు చట్టాలు తీసుకొస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న బిట్‌కాయిన్ సృష్టికర్త ఎవరో ఇప్పటికీ తెలియదు!
టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు కూడా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు ఉన్నాయి. ఆయన చాలాసార్లు సంకేతాల రూపంలో కొన్ని విషయాలు చెబుతుంటారు. మూడు రోజుల క్రితం మస్క్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కొన్ని ప్రముఖ కంపెనీల పేర్లలోని కొన్ని అక్షరాలను రౌండప్ చేశారు. అందులోని పేర్లను గమనిస్తే బిట్‌కాయిన్ సృష్టికర్తగా భావిస్తున్న వ్యక్తి పేరుగా తెలుస్తోంది.
శామ్‌సంగ్, తోషిబా, నకమిచి, మోటోరొలా పేర్లలో కొన్ని పదాలను మస్క్ రౌండప్ చేశారు. వాటన్నటినీ కలిపితే 'సటోషి నకమోటో' అని వస్తోంది. బిట్‌కాయిన్ సృష్టికర్త ఆయనేనని ఇంటర్నెట్లో ఎంతోమంది చెబుతుంటారు. ఎలన్ మస్క్ ఇప్పుడు ట్వీట్ చేయడంతో మరోసారి ఈ పేరు చర్చకు దారితీసింది. ఒక బిట్‌కాయిన్ ఖరీదు చాలా ఎక్కువ. వాటిని కొనడం తేలిక కాదు. అందుకే దానిని పదికోట్ల సటోషి నకమోటోలుగా విభజించారని అంటారు. మస్క్ క్రిప్టిక్ ట్వీటు చేయడంతో మీమ్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.