Elon Musk In Guinness Record: ఆస్తిపాస్తులను సంపాదించడంలోనే కాదు, పోగొట్టుకోవడంలోనూ ఎలాన్‌ మస్క్‌దే రికార్డ్‌. ప్రపంచ నంబర్‌ వన్‌ బిలియనీర్‌ స్థానం నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయిన ఈ లక్ష్మీపుత్రుడు, సంపద కోల్పోవడంలో రికార్డ్‌ సృష్టించారు. ఆయన ఎంత పోగొట్టుకున్నారంటే... ఆ పతనాన్ని రికార్డ్‌ను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ (Guinness World Records) కూడా గుర్తించింది.


ప్రపంచంలోనే అతి ఖరీదైన ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేసే టెస్లా కంపెనీకి (Tesla Inc) ఎలాన్‌ మస్క్‌ CEO. ఆ కంపెనీలో అతి పెద్ద షేర్‌ హోల్డర్‌. 2022లో టెస్లా స్టాక్‌ భారీగా పతనమైంది. దీంతో, ఎలాన్ మస్క్ సంపదకు పెద్ద కన్నం పడింది. టెస్లా స్టాక్‌ పతనం వల్లే భారీగా వ్యక్తిగత ఆస్తిని పోగొట్టుకుని, ప్రపంచ రికార్డు సృష్టించారు. 


180 బిలియన్ డాలర్లు హుష్‌ కాకీ
గత ఏడాది కాలంలో (2022లో) ఎలోన్ మస్క్ 180 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, 2021 ముగింపు నాటికి, ఎలాన్ మస్క్ ఆస్తులు 320 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి, 2023 జనవరి ప్రారంభం నాటికి ఇవి 138 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.


ఇంత తక్కువ సమయంలో (కేవలం ఒక్క ఏడాదిలో) అంత పెద్ద ఆస్తి (180 బిలియన్ డాలర్లు) పోగొట్టుకున్న ఎలోన్ మస్క్, 22 ఏళ్ల గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు జపనీస్ టెక్ ఇన్వెస్టర్ మసయోషి సన్ పేరిట ఉంది. ఆయన 2000లో 58.6 బిలియన్లను కోల్పోయారు. దాంతో పోలిస్తే, ఎలాన్‌ మస్క్‌ కోల్పోయిన సంపద మూడు రెట్లు ఎక్కువ. బహుశా, మస్క్‌ మామ రికార్డ్‌ను ఇంకెవరూ బద్ధలు కొట్టలేరేమో!.


రెండో స్థానానికీ అదానీ నుంచి ముప్పు
ఇటీవలి నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ 200 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కోల్పోయారు. ఒక వ్యక్తి 200 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కోల్పోవడం చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అన్న హోదాను కూడా మస్క్‌ కోల్పోయారు, రెండో స్థానానికి పడిపోయారు. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ 'లూయిస్ విట్టన్' ప్రమోటర్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ తొలిస్థానంలోకి వెళ్లారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ 190 బిలియన్ డాలర్లు. అయితే.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ తొలి స్థానానికి వెళ్లారు అనే కంటే, మస్క్‌ మామే రెండో స్థానానికి దిగి వచ్చారు అనడమే కరెక్ట్‌. ఎందుకంటే, సంపద కోల్పోకముందు మస్క్‌ ఆస్తుల విలువ 320 బిలియన్ డాలర్లు. ఇప్పుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల విలువ 190 బిలియన్ డాలర్లు. ఈ రెండు మొత్తాలకూ నక్కకు-నాగలోకానికి ఉన్నంత గ్యాప్‌ ఉంది. సంపద పోగొట్టుకోకపోతే, మస్క్‌ ఎప్పటికీ, ఎవరికీ అందనంత స్థాయిలోనే ఉండేవారు, ఇది కూడా ఒక గిన్నిస్‌ రికార్డ్‌ అయి ఉండేది.


ప్రస్తుతం, ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు అన్న టైటిల్‌ను కూడా ఎలాన్ మస్క్ కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న భారతీయుడు గౌతమ్ అదానీ ఆస్తులు 120 బిలియన్ డాలర్లు. వీళ్లిద్దరికీ ఇప్పుడు కేవలం 
10 బిలియన్ డాలర్ల తేడా మాత్రమే ఉంది.