Ambani vs Elon Musk:
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు! అత్యంత వేగంగా స్టార్ లింక్ సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను భారత్‌కు పరిచయం చేయాలని మస్క్ తొందరపడుతున్నాడు. అయితే రిలయన్స్ జియోను నడిపిస్తున్న అంబానీ దానిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిసింది.
ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి బిజినెస్ టైకూన్స్‌తో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో స్టార్ లింక్ సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మస్క్ మంగళవారం ప్రకటించారు. అక్కడి గ్రామీణ ప్రాంతాలకు అత్యధిక వేగంగా ఇంటర్నెట్ అందించేందుకు ఇదెంతో ఉపయోగపడుతుందని నొక్కి చెప్పారు. అయితే లైసెన్సింగ్ ఫీజు తీసుకొని అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిని రిలయన్స్ జియో వ్యతిరేకిస్తోందని తెలిసింది. అలా చేస్తే కాంపిటీషన్ ఆరోగ్యకరంగా ఉండదని, భారత కంపెనీలు వెనకబడతాయని అంబానీ అంటున్నారు. కాబట్టి సాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఎలన్ మస్క్ స్టార్ లింక్ సేవల్ని మొదలు పెట్టారు. ఇందుకోసం ఆ దేశాలు కేవలం లైసెన్సింగ్ ఫీజును వసూలు చేశాయి. సాటిలైట్ స్పెక్ట్రమ్ సహజ వనరు అని వేలం నిర్వహిస్తే జియోగ్రాఫికల్ రిస్ట్రిక్షన్స్‌తో సేవల ధరలు మరింత పెరుగుతాయని మస్క్ అంటున్నారు. దాంతో విదేశీ కంపెనీల డిమాండ్లకు తలొగ్గొద్దని అంబానీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా విదేశీ కంపెనీలు పోటీకి రాకుండా అడ్డుకోవాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం రిలయన్స్ జియోకు 43.9 కోట్ల మంది టెలికాం యూజర్లు ఉన్నారు. కంపెనీ మార్కెట్ లీడర్‌గా ఉంది. ఇక 80 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లతో 25 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. భారత సాటిలైట్ స్పెక్ట్రమ్ వేలంపై పారిశ్రామిక వర్గాల నుంచి అభిప్రాయాలు కోరగా 64 మంది స్పందించారు. 48 మంది లైసెన్సింగ్, 12 మంది వేలానికి ఓటేశారు. మిగిలిన వాళ్లు తటస్థంగా ఉన్నారని తెలిసింది. సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు స్టార్ లింక్‌తో పాటు అమెజాన్ వెబ్ సర్వీసెస్, వన్ వెబ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలన్ మస్క్ బుధవారం (జూన్ 21) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధానిని ప్రశంసించారు. న్యూయార్క్‌లో ఆయనతో సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడారు. భారత ప్రధానికి దేశాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లాను రమ్మని ఆహ్వానించారని అన్నారు.
మోదీతో మీటింగ్ తర్వాత మాట్లాడిన ఎలన్ మస్క్... తాను మోదీకి అభిమానినని చెప్పారు. ప్రధాని మోదీతో సమావేశం చాలా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిందన్న మస్క్..త్వరలో భారత్ పర్యటనను రానున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ ను ఇండియాకు తీసుకురావటం ద్వారా మారుమూల పల్లె ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలను అందించేందుకు అవకాశంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మస్క్ తెలిపారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial