Elon Musk offers buy Twitter 54 20 dollar per share in cash: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కంపెనీకి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని తాను అన్‌లాక్‌ చేస్తానని అంటున్నారు. ట్విటర్‌ను తనకు అమ్మేందుకు ఓ బెస్ట్‌, ఫైనల్‌ డీల్‌ను ప్రతిపాదించారు.


ట్విటర్‌ ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎలన్‌ మస్క్‌ అన్నారు. జనవరి 28 ముగింపు ధరతో పోలిస్తే 54 శాతం ప్రీమియం చెల్లిస్తానని పేర్కొన్నారు. అప్పటికి ఆ షేరు ధరను విలువ కడితే 43 బిలియన్‌ డాలర్లు అవుతోంది. అప్పట్నుంచి ఈ సోషల్‌ మీడియా కంపెనీ షేరు 18 శాతం పెరిగింది.


గురువారం రోజు ఎలన్‌ మస్క్‌ ఈ ఆఫర్‌ను అమెరికా సెక్యూరిటీ, ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ వద్ద దాఖలు చేశారు. ఇప్పటికే ఆ కంపెనీలో మస్క్‌కు 9 శాతం వాటా ఉంది. ఏప్రిల్‌ 4న తొలిసారి ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.


టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ట్విటర్లో ఎక్కువగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఆయనకు ఈ వేదికలో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్లో చేయాల్సిన మార్పులపై ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడారు. వాటా ఉందని తెలియడంతో కంపెనీ ఆయన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ పదవిని ఆఫర్‌ చేసింది. దాంతో ఆయన లార్జెస్ట్‌ ఇండివిజ్యువల్‌ షేర్‌ హోల్డర్‌గా మారారు.


తన వాటా గురించి బయటకు తెలియగానే మస్క్‌ ఎన్నో ప్రతిపాదనలు చేశారు. మున్ముందు ఎలాంటి మార్పులు అవసరమో వెల్లడించారు. సాన్‌ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం, ట్వీట్లకు ఎడిట్‌ బటన్‌ ఇవ్వడం, ప్రీమియం యూజర్లకు ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్‌ మార్క్స్‌ ఇవ్వడం గురించి మాట్లాడారు. చాలా అరుదగా ట్వీట్‌ చేసే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీల వల్ల ట్విటర్‌ చనిపోయే ప్రమాదం ఉందనీ ఆయన హెచ్చరించారు.


బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం ఎలన్‌ మస్క్‌ సంపద 260 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దాంతో ఆయన సులభంగా ట్విటర్‌ను కొనుగోలు చేయగలరు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ట్విటర్‌ విలువ 37 బిలియన్‌ డాలర్లు మాత్రమే.