Elon Musk: 


టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ కోరుకోని ఘనత అందుకున్నాడు. ప్రపంచ చరిత్రలోనే 200 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ భూమ్మీద అపర కుబేరుడిగా ఎదిగిన అతడికి 2022 ద్వితీయార్థంలో కాలం కలిసి రాలేదు.


అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తర్వాత 2021 జనవరిలో ఎలన్‌ మస్క్‌ ఏకంగా 200 బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించాడు. అదే ఏడాది నవంబర్లో అతడి సంపద 173 బిలియన్‌ డాలర్ల నుంచి 340 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. డిసెంబర్‌ 31 నాటికి అతడు 200 బిలియన్‌ డాలర్ల మేర సంపదను కోల్పోవాల్సి వచ్చింది. టెస్లా షేర్ల ధర పతనమవ్వడమే ఇందుకు కారణం.


శనివారానికి టెస్లా కంపెనీ షేర్ల విలువ 65 శాతానికి పైగా పడిపోయింది. ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకూ కొంత వాటాను విక్రయించడమూ ఇందుకు దోహదం చేసింది. దాంతో టెస్లా షేర్లు ఎలన్‌ మస్క్‌ అతిపెద్ద ఆస్తి కాదని బ్లూమ్‌బర్గ్‌ వెల్త్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. ప్రస్తుతం స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ విలువ 44.8 బిలియన్ డాలర్లు. అందులో మస్క్‌కు 42.2 శాతం వాటా ఉంది. టెస్లా పొజిషన్‌తో పోలిస్తే ఇందులోనే అతడికి ఎక్కువ వాటా ఉండటం గమనార్హం.


ఎలన్‌ మస్క్‌కు 2021 బాగా కలిసొచ్చింది. టెస్లా మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్‌ మైలురాయి దాటేసింది. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఆల్ఫాబెట్‌ సరసన నిలిచింది. కాగా అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను వేగంగా పెంచడం వల్లే ఎకానమీ పతనమవుతోందని మస్క్‌ విమర్శిస్తున్నాడు. 'గతంలో ఎన్నడూ లేని విధంగా టెస్లా రాణిస్తోంది. మేం ఫెడరల్‌ రిజర్వును నియంత్రించలేం. ఇక్కడ అసలు సమస్య అదే' అని డిసెంబర్‌ 16న ఆయన ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.