Byjus News: భారతీయ స్టార్టప్ రంగానికి పోస్టర్ బాయ్‌గా నిలిచిన బైజూస్‌కు సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఈ ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీ, ఇప్పుడు తన కార్యాలయాలను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది, బెంగళూరు నుంచి ప్రారంభమైంది.


ET రిపోర్ట్‌ ప్రకారం, బైజూస్, తన ఖర్చులు తగ్గించుకోవడానికి కార్యాలయ స్థలాన్ని తగ్గించడం ప్రారంభించింది. బెంగళూరులోని ప్రెస్టీజ్ టెక్ పార్క్‌లో ఉన్న 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని ఈ కంపెనీ ఇటీవలే ఖాళీ చేసింది. ఈ కార్యాలయ స్థలం లీజు ఈ సంవత్సరం ప్రారంభంలో రద్దయింది. బకాయి ఉన్న అద్దెను డిపాజిట్ ఉపయోగించి చెల్లిస్తున్నారు. ఇంకా, కొన్ని ఆస్తులకు సంబంధించి సంబంధిత యజమాన్యాలతో వివాదం నడుస్తోందని ఈటీ రిపోర్ట్‌ చేసింది.


నెల అద్దె రూ.4 కోట్లు
బైజూస్‌ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ (Think & Learn Pvt Ltd), బెంగళూరులో ఉన్న ప్రాపర్టీని మూడున్నరేళ్ల క్రితం ప్రెస్టీజ్ గ్రూప్ నుంచి లీజుకు తీసుకుంది. ఈ కార్యాలయ స్థలం కోసం ప్రతి నెలా రూ. 4 కోట్ల అద్దె చెల్లిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఆర్థిక పరిస్థితి అతి భారీగా క్షీణించడం వల్ల, కొన్ని ఆఫీసుల అద్దెలను సకాలంలో చెల్లించలేకపోతోంది.


బెంగళూరులోనే ఉన్న మరో ఆఫీస్ స్పేస్‌పైనా సమస్యలు కమ్ముకున్నాయి. ఇది కళ్యాణి టెక్ పార్క్‌లో, 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కళ్యాణి డెవలపర్స్ నుంచి ఈ స్థలాన్ని బైజూస్ లీజుకు తీసుకుంది. బైజూస్ గత 10 నెలలుగా ఈ ఆస్తికి అద్దె చెల్లించలేదు. దీంతో, కళ్యాణి డెవలపర్స్, బైజూస్‌ డిపాజిట్ నుంచి 7 నెలల అద్దెను తీసుకుంది. అంతేకాదు, బైజూస్‌కి లీగల్ నోటీస్‌ పంపింది.


కాస్త ఉపశమనం
నిధుల విషయంలో బైజూస్‌కు కొంత ఉపశమనం లభించింది. ఇటీవల, ఈ కంపెనీ రైట్స్ ఇష్యూ ప్రారంభించింది. ఈ నెలాఖరులో ఈ ఆఫర్‌ క్లోజ్‌ అవుతుంది. బైజూస్‌, రైట్స్‌ ఇష్యూ ద్వారా వివిధ పెట్టుబడిదార్ల నుంచి 300 మిలియన్‌ డాలర్ల వరకు కమిట్‌మెంట్స్‌ పొందింది. ఈ ఇష్యూ నుంచి 200 మిలియన్ డాలర్లు సేకరించాలన్నది కంపెనీ ప్రయత్నం. దీని కోసం, బైజూస్, తన కంపెనీ విలువను 99 శాతం కుదించి, 220-250 మిలియన్ డాలర్లకు తగ్గించింది. ఈ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉంది.


విలువ తగ్గించిన బ్లాక్‌రాక్‌
అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ బ్లాక్‌రాక్‌, ఈ ఏడాది జనవరిలో, బైజూస్‌ విలువను 1 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసింది. బ్లాక్‌రాక్‌కు బైజూస్‌లో వాటా ఉంది. తన వాటా విలువను లెక్కగడుతూ, బైజూస్‌ విలువ కేవలం 1 బిలియన్‌ డాలర్లుగా బ్లాక్‌రాక్‌ అంచనా వేసింది. 2023 మార్చిలోనూ బైజూస్‌ విలువలో కోత పెట్టింది. అప్పుడు, సంస్థ విలువను 8.4 బిలియన్‌ డాలర్లకు కుదిస్తున్నట్లు అమెరికా NECకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. దీనికిముందు, 2022 డిసెంబర్‌లో, 11.5 బిలియన్ డాలర్లకు కుదించింది. 


తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బైజూస్‌, ఫిబ్రవరి ప్రారంభమైన 4 రోజుల తర్వాత గానీ తన ఉద్యోగులకు జనవరి నెల జీతాలు చెల్లించలేకపోయింది. ఎంతో ప్రయత్నం చేస్తేగానీ జీతాలు ఇవ్వలేకపోయినట్లు బైజూస్‌ CEO రవీంద్రన్‌ (Byju Raveendran) స్వయంగా చెప్పడం కంపెనీ కష్టాలకు అద్దం పడుతోంది. ఉద్యోగుల జీతాల కోసం ఈ కంపెనీ నెలకు దాదాపు రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. 


మరోవైపు, CEO రవీంద్రన్‌ను కుర్చీ నుంచి దింపేందుకు బైజూస్‌ ఇన్వెస్టర్లంతా ఏకమయ్యారంటూ ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై బైజూస్‌ స్పందించింది, ఇన్వెస్టర్లకు అలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది.


మరో ఆసక్తికర కథనం: పర్సనల్ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ - డబ్బు అవసమైనప్పుడు ఏది మంచిది?