ED seizes Xiaomi's assets: చైనా మొబైల్ కంపెనీ షియామికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షాకిచ్చింది! రూ.5551 కోట్ల విలువైన కంపెనీ ఆస్తులను సీజ్ చేశారు. డబ్బును అక్రమంగా విదేశాలకు తరలించిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది.
ఫారిన్ ఎక్స్‌ఛేజ్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని ఉల్లంఘించడంపై షియామీని ఈడీ ప్రశ్నించింది. షియామి టెక్నాలజీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పైన చర్యలు తీసుకుంది. సంబంధిత సంస్థ దేశ వ్యాప్తంగా షియామి, ఎంఐ బ్రాండ్లతో మొబైళ్లను విక్రయించే సంగతి తెలిసిందే.
'చైనాకు చెందిన షియామీ గ్రూప్ సబ్సిడరీ కంపెనీ షియామీ ఇండియా. కంపెనీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.5551 కోట్ల డబ్బును ఈడీ సీజ్ చేసింది' అని దర్యాప్తు సంస్థ తెలిపింది. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో కొన్నాళ్ల నుంచి షియామీ ఇండియాపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. రాయితీల రూపంలో అక్రమంగా డబ్బును విదేశాలకు పంపిస్తున్నారని కేసు నమోదు చేసింది. 2014లో ఆపరేషన్స్ ఆరంభించిన ఈ కంపెనీ ఆ మరుసటి ఏడాది నుంచే అక్రమంగా డబ్బు పంపించడం మొదలు పెట్టింది.
'రూ.5551 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని రాయల్టీ పేరుతో షియామీ గ్రూప్‌నకు చెందిన మూడు విదేశీ కంపెనీలకు పంపించింది. చైనాలోని మాతృ సంస్థ ఆదేశాల మేరకే ఇలా చేసింది. అమెరికాలోని కంపెనీలకు పంపించిన డబ్బు వల్ల షియామీ గ్రూప్ మొత్తానికీ ప్రయోజనం లభిస్తుంది. షియామీ ఇండియా ఇక్కడ మొబైల్ ఫోన్లను తయారు చేస్తోంది. మూడు విదేశీ కంపెనీ సేవలను వాడుకోవడమే లేదు. అలాంటి వాటికి డబ్బులను తరలించింది. రాయల్టీ రూపంలో ఇలా డబ్బును పంపించడం ఫెమా చట్టం ఉల్లంఘన కిందకే వస్తుంది' అని ఈడీ తెలిపింది.