World Bank: 


గ్లోబల్‌ ఎకానమీలో ఇండియాకు తిరుగులేదు! ఇన్‌ఫ్లేషన్‌, బ్యాంకింగ్‌ క్రైసిస్‌తో వెస్ట్రన్‌ వరల్డ్‌ ఒకవైపు ఇబ్బంది పడుతుంటే... ఇండియానేమో ఎవరికీ సాధ్యమవ్వని వృద్ధిరేటుతో దూసుకుపోతోంది. 2024 ఆర్థిక ఏడాదిలో భారత్‌ 6.3 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తుందని వరల్డ్‌ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇచ్చిన 6.6 శాతంతో పోలిస్తే వృద్ధి అంచనాలను కాస్త తగ్గించింది.




వార్షిక ప్రాతిపదికన అక్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్లో భారత్‌ 4.4 శాతం గ్రోథ్‌రేట్‌ నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని 11.2 శాతంతో పోలిస్తే ఇదెంతో తక్కువ! చివరి క్వార్టర్‌లోని 6.3 శాతంతో కంపేర్‌ చేస్తే కొంత తక్కువ! అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంతో తేడా వచ్చింది. కరోనా తర్వాత మార్కెట్లు పూర్తిగా ఓపెనవ్వడంతో ఎకానమీ ఒక్కసారిగా పుంజుకుంది. ఊహించని వృద్ధిరేటు నమోదు చేసింది. ఆ తర్వాత ఇన్‌ఫ్లేషన్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, జియో పొలిటికల్‌ స్ట్రగుల్స్‌, ఎకానమీ స్లోడౌన్‌తో కాస్త తగ్గింది. ఆర్బీఐ 250 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేటు పెంచడమూ ఇందుకు దోహదం చేసింది. ఏదేమైనా వార్షిక ప్రాతిపదికన 6 శాతం కన్నా ఎక్కువే నమోదు చేస్తుండటం గమనార్హం.


పెరుగుతున్న వడ్డీరేట్లు, తగ్గుతున్న ఆదాయ వృద్ధి వంటివి ప్రైవేటు వినియోగ వృద్ధిపై ఆధారపడనున్నాయి. కరోనా టైమ్‌లో ఇచ్చిన ఫైనాన్షియల్‌ సపోర్ట్‌ మెజర్స్‌ ఆగిపోవడంతో ప్రభుత్వ వినియోగ వృద్ధిరేటు నెమ్మదించనుందని వరల్డ్‌ బ్యాంకు అంచనా వేసింది. కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌ జీడీపీలో 2.1 శాతానికి తగ్గుతుందని... గతేడాది 3 శాతంతో పోలిస్తే మెరుగవుతుందని చెప్పింది. గ్లోబల్‌ ఎకానమీ, బ్యాంకింగ్‌ క్రైసిస్‌తో ఇండియా సహా ఎమర్జింగ్‌ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు తగ్గాయని తెలిపింది. ఏదేమైనా ఇండియా బ్యాంకుల్లో సరిపడినంత మూలధనం ఉందని వెల్లడించింది.


ఏప్రిల్‌ 2023తో మొదలవుతున్న ఆర్థిక ఏడాదిలో ఎకనామిక్‌ గ్రోథ్‌ 6.5 శాతంగా ఉంటుందని ఎకానామిక్‌ సర్వే అంచనా వేసిన సంగతి తెలిసిందే. క్రితం ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటును ఆర్బీఐ 7 నుంచి 6.4 శాతానికి తగ్గించింది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్‌ సైతం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును స్థిరంగా 6 శాతంగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుందని తెలిపింది.