Dream11 Employees: ఉద్యోగం చేసే ఎవరైనా, తాను సెలవు పెట్టిన రోజున ఆఫీసు పని గురించి ఆలోచించకూడదని అనుకుంటాడు. ఏ కారణంతో సెలవు పెట్టాడో, ఆ పని పూర్తి చేసుకోవాలని భావిస్తాడు. కానీ, అన్నిసార్లు ఇలాగే ఉండదు. కొంతమంది సెలవులో ఉన్నా... అర్జంట్‌ వర్క్‌ అనో, సందేహాలు ఉన్నాయనో బాస్‌ నుంచో, తోటి ఉద్యోగుల నుంచో ఫోన్లు, మెసేజ్‌లు వస్తుంటాయి. బాస్‌ అంటే భయంతోనో, తోటి ఉద్యోగుల అడిగారు కాబట్టి మొహమాటం కొద్దో సెలవు పెట్టిన రోజు కూడా ఉద్యోగి పని చేయాల్సి వస్తుంది. దీంతో, లీవ్‌ కాస్తా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌గా మారుతుంది. సెలవు రోజు చేయాల్సిన అసలు పని వాయిదా పడుతుంది.


దీనిని దృష్టిలో ఉంచుకుని, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ Dream11 ఒక ఆసక్తికరమైన విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఉద్యోగులు తమ సెలవులను ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తుంది. ఈ కొత్త పద్ధతి ప్రకారం... సెలవులో ఉన్న ఉద్యోగిని ఆఫీసులో ఉన్న బాస్‌గానీ, ఇతర ఉద్యోగులు గానీ పని పేరుతో ఇబ్బంది పెట్టినట్లయితే, వారికి భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వస్తుంది.


డ్రీమ్‌11 అన్‌ప్లగ్‌ పాలసీ
సెలవులో ఉన్న ఉద్యోగుల ప్రశాంతత కోసం డ్రీమ్‌11 ప్రవేశ పెట్టిన కొత్త విధానం పేరు 'అన్‌ప్లగ్ పాలసీ' (Dream11 Unplug Policy). ఈ పాలసీ ప్రకారం... ఉద్యోగులు పని సంబంధిత ఈ-మెయిల్స్‌, సందేశాలు, కాల్స్‌తో పాటు సహోద్యోగుల నుంచి కూడా ఒక వారం రోజుల పాటు దూరంగా ఉండవచ్చు. ఈ నిబంధన అతిక్రమించి, సెలవులో ఉన్న ఉద్యోగికి ఎవరైనా ఆఫీసు పనికి సంబంధించి కాల్‌ చేసినా, సందేశం పంపినా వాళ్లకు లక్ష రూపాయలు జరిమానాను కంపెనీ విధిస్తుంది. అంటే.. వారం రోజుల పాటు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కావడమే 'డ్రీమ్‌11 అన్‌ప్లగ్‌ పాలసీ'. 


"డ్రీమ్11లో, అన్‌ప్లగ్ చేసిన 'డ్రీమ్‌స్టర్'ని, ప్రతి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ నుంచి లాగ్ ఆఫ్ చేస్తాము. అది స్లాక్ కావచ్చు, ఈ-మెయిల్‌లు, వాట్సాప్ గ్రూపులు కూడా కావచ్చు. ఒకరు, అర్హత గల విరామంలో ఉన్నప్పుడు డ్రీమ్‌స్టర్ వర్క్ ఎకోసిస్టమ్ నుంచి ఎవరూ వారిని సంప్రదించరు" అని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో కంపెనీ పేర్కొంది.


కంపెనీ వ్యవస్థాపకులు హర్ష్ జైన్ ‍‌(Harsh Jain) & భవిత్ సేథ్‌ ‍‌(Bhavit Seth) వెల్లడించిన ప్రకారం... కొత్త పాలసీ కింద, కంపెనీలోని ప్రతి ఒక్కరూ 'అన్‌ప్లగ్' టైమ్‌ను పొందవచ్చు. ఉద్యోగి హోదా, సంస్థలో ఎప్పుడు చేరాడు వంటి ఏ అంశంతో సంబంధం లేకుండా 'అన్‌ప్లగ్' సమయాన్ని ఎంజాయ్‌ చేయవచ్చు. 


కంపెనీ ఏ ఒక్క ఉద్యోగిపైనా ఆధారపడదు అని చెప్పడం కూడా అన్‌ప్లగ్‌ పాలసీ ఉద్దేశం.


కంపెనీ కొత్త పాలసీ పట్ల ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. సెలవులో ఉన్నప్పుడు కంపెనీకి చెందిన అన్ని వ్యవస్థల నుంచి మినహాయించడం అంటే.. ఒక ఉద్యోగి పొందగలిగే ఉత్తమ నజరానాల్లో ఇది ఒకటి అని చెబుతున్నారు. కొంత నాణ్యమైన సమయాన్ని (Quality Time లేదా వ్యక్తిగత సమయం) గడపడంలో ఇది తమకు సాయపడుతుందని, తిరిగి ఆఫీసుకు వచ్చినప్పుడు అత్యుత్తమ పనితీరును అందించడానికి కొత్త శక్తిని అందిస్తుందని అన్నారు.