Trump Tariffs Could Be An Opportunity For Make In India: భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 26% ప్రతీకార సుంకాన్ని అమెరికా విధించింది. అసలు ఈ సుంకాల గోల ఏంటి, భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, భారతదేశం వాటిని ఎలా ఎదుర్కోగలదు వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. భారతదేశానికి అమెరికా ఒక ప్రధాన వాణిజ్య భాగస్వామి. 2024లో, భారత్‌ $81 బిలియన్ల విలువైన ఉత్పత్తులను USకు ఎగుమతి చేసింది. కొత్తగా విధించిన సుంకాలు భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్త్రాలు, ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఆభరణాలు, రత్నాలు, ఆక్వా వంటి రంగాలపై ప్రభావం చూపుతాయి. అదే సమయంలో, ఔషధాలు, ఐటీ సేవలు, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మినహాయింపు లభించింది.

ప్రతీకార సుంకం అంటే ఏంటి?ఆంగ్లంలో దీనిని రెసిప్రోకల్‌ టారిఫ్‌ (Reciprocal Tariff) అంటారు. సాధారణంగా, ఒక దేశం నుంచి మరో దేశంలోకి ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. దిగుమతి చేసుకునే దేశం, స్థానిక పరిశ్రమల రక్షణ కోసం, దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలు విధిస్తుంది. తద్వారా, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి ఈ సుంకాలు 100%-200% వరకు ఉంటాయి. ఉదాహరణకు, అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న లగ్జరీ కార్‌పై 100% దిగుమతి సుంకం విధిస్తే, ఆ కార్‌ ధరకు సమానంగా భారత్‌లో సుంకం చెల్లించాలి. అంటే, అమెరికా నుంచి భారత్‌లోకి వచ్చేసరికి కార్‌ ధర రెట్టింపు అవుతుంది. దీనివల్ల అమెరికా నుంచి కార్‌ ఎగుమతులు తగ్గుతాయి, ఇది US కంపెనీలకు నష్టం. దీనికి ప్రతిగా, అమెరికా కూడా భారత్‌ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తిపై 100% సుంకం విధిస్తే, దానిని "ప్రతీకార సుంకం" అంటారు. అంటే, భారత్‌ విధించే సుంకాలను సమం చేస్తూ అమెరికా కూడా సుంకాలు విధించడమే ప్రతీకార సుంకం. ఇప్పుడు, డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిందే అదే. అమెరికా నుంచి భారత్‌కు మొత్తం ఎగుమతులు & దిగుమతుల మధ్య అంతరాన్ని లెక్కించిన ట్రంప్‌, భారత్‌పై 26% ప్రతీకార సుంకం విధించారు. వాస్తవానికి, ట్రంప్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే చైనాతో సుంకాల యుద్ధం మొదలు పెట్టారు. ఇప్పుడు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, మిగిలిన దేశాలపైనా కత్తి దూశారు.

భారత్‌పై అమెరికా విధించిన కొత్త సుంకాలు ఏంటి?US సుంకాల ప్రణాళికలో భాగంగా, మొదట అన్ని దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10% సుంకం విధించారు. తర్వాత, కొన్ని దేశాలకు ప్రత్యేక సుంకాలు ఉంటాయి. భారత్‌పై 26% సుంకం విధించారు. ఫార్మా, సెమీకండక్టర్లు, రాగి, ఎనర్జీ సంబంధిత ఉత్పత్పులు (చమురు, గ్యాస్, బొగ్గు, LNG) వంటివాటికి ఈ సుంకం నుంచి మినహాయింపు లభించింది. ఉక్కు, అల్యూమినియం, వాహనాలు వంటివాటిపై 25% సుంకం భారత్‌తో సహా అన్ని దేశాలకు వర్తిస్తుంది. భారతదేశం నుంచి US వెళ్లే మిగిలిన వస్తువులపై 26% సుంకం వర్తిస్తుంది.

భారత్‌-అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వాణిజ్యం జరుగుతోంది. 2024లో, భారతదేశం అమెరికాకు $81 బిలియన్ల విలువైన వస్తువులు ఎక్స్‌పోర్ట్‌ చేసింది. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో ఇది 17.7%. అదే సమయంలో, అమెరికా నుంచి ఇతి తక్కువ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. అంటే, అమెరికాకు అమ్మే దానికంటే అమెరికా నుంచి కొంటున్న వస్తువుల మొత్తం విలువ చాలా తక్కువ.

భారత్‌లో ఏయే రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి?రొయ్యలు వంటి సముద్ర ఆహారాలు, ఇనుము & ఉక్కు, యంత్రాలు, ఔషధాలు, రత్నాలు & ఆభరణాలు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ వంటి వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. 

ప్రయోజనం పొందే రంగాలు ఉన్నాయా?ఉన్నాయి. ట్రంప్‌ టారిఫ్‌ల నుంచి ఔషధ పరిశ్రమకు మినహాయింపు లభించింది. చైనా, బంగ్లాదేశ్‌తో పోలిస్తే వస్త్ర పరిశ్రమ విషయంలోనూ మనకు అవకాశం ఉంటుంది. ప్రతీకార సుంకాల్లో వాహన రంగాన్ని పేర్కొనకపోవడం కూడా ఒక అవకాశం. ఇవన్నీ భారతదేశానికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి.

భారత్‌కు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?భారతదేశానికి అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. భారతదేశం అమెరికా నుంచి మరిన్ని చమురు, గ్యాస్, రక్షణ పరికరాలను కొనుగోలు చేయవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు, విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తగ్గవచ్చు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవచ్చు, 2025 చివరి నాటికి ఇది పూర్తి కావచ్చు. 

చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి ఇతర ఆసియా దేశాల కంటే భారతదేశంపై అమెరికా సుంకం తక్కువ. ఆ దేశాలపై అధిక సుంకాలు విధించారు. ఫలితంగా, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు వంటి రంగాల్లో భారత్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. అమెరికన్ కంపెనీలు అధిక సుంకాలు ఉన్న దేశాల నుంచి కాకుండా తక్కువ సుంకం ఉన్న భారత్‌ నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ఇది "మేక్‌ ఇన్‌ ఇండియా"కు బలం చేకూరుస్తుంది. ఈ అవకాశాలను అందుకోవడానికి కర్మాగారాలు, నాణ్యత, మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవాలి.

వాణిజ్య శాఖ కీలక ప్రకటనట్రంప్‌ సుంకాలపై భారత వాణిజ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతీకార సుంకాల వల్ల ఏర్పడే కొత్త పరిణామాలు & అవకాశాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించింది. "వికసిత భారత్‌" లక్ష్యంగా అధ్యయనం జరుపుతున్నట్లు తెలిపింది.