Trump Effect On Indian Techies: అమెరికాలో బంగారు భవిష్యత్‌ను సృష్టించగల H-1B వీసాలు, గ్రీన్ కార్డుల కోసం క్యూలో నిల్చున్నవాళ్లు, ముఖ్యంగా ఇండియన్ టెక్ ఎక్స్‌పర్ట్స్ భవిష్యత్తు ఇప్పుడు అమోయయంలో పడింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ పౌరులకు జారీ చేసే తాత్కాలిక వీసాలైన H-1B వీసా రెన్యువల్, ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లో కొత్త ఉపాధిని వెతుక్కోవడం, డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడం వంటివన్నీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం, H-1B వీసాలలో 72% భారతీయుల వద్ద ఉన్నాయి. H-1B వీసా కార్యక్రమంలో భారతీయులే ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ట్రంప్ 2.0 పాలనలో పరిస్థితి మారబోతోంది, ఏరివేత మొదలు కాబోతోంది.
H-1B వీసా ఉన్న వ్యక్తికి USలో ఆరు సంవత్సరాలు ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ప్రారంభంలో మూడు సంవత్సరాల కాలానికి మంజూరు అవుతుంది, మరో మూడు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. H-1B వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, ఎక్స్‌టెన్షన్ కోసం అప్లై చేసిన తర్వాత USను దాటి ప్రయాణించవద్దన్నది ఎక్స్‌పర్ట్స్ సలహా.
అమెరికా ఫస్ట్
అమెరికాలో మెక్సికన్ల తర్వాత భారతీయులదే రెండో అతి పెద్ద వలస బృందం. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత H-1B వీసాల విధానంలో మరిన్ని మార్పులు & కఠిన చర్యలు తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు. ప్రతి సందర్భంలో "అమెరికా ఫస్ట్" గురించి మాట్లాడారు. ఈ మాటలతో చాలా మంది ఇండియన్ టెక్కీలకు చెమటలు పట్టాయి. గతంలో యూఎస్‌ను విడిచి ఇతర దేశాలకు వెళ్లినవాళ్లు, ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే తిరిగి అమెరికా చేరుకున్నారు. ట్రంప్ గద్దెనెక్కాక మళ్లీ యూఎస్‌లోకి రానిస్తారో, లేదోనని భయపడ్డారు.
అమెరికాలో ఉంటున్న టెక్కీలకు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి - 1. అమెరికన్‌గా మారే కల నిజమయ్యే వరకు ఓపికగా ఎదురు చూడడం 2. ఇప్పటికిప్పుడు భారత్‌కు తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండటం. ఈ రెండింటి మధ్యలో వాళ్ల భవిష్యత్తు ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది.
ఇండియన్ టెక్కీలు ప్రతి కొన్ని సంవత్సరాలకు తిరిగి మొదటి స్థానానికే చేరుకుంటారు. H-1B వీసా రెన్యువల్‌పై అనిశ్చితి & ఆందోళనలు వాళ్లను వెంటాడుతుంటాయి. అంతులేని చక్రంలా ఇది తిరుగుతూనే ఉంటుంది. సంవత్సరాలుగా USలో నివసిస్తున్న ఉద్యోగులు, ట్రంప్ వచ్చాక మారబోయే H-1B వీసా విధానాల గురించి తీవ్రంగా భయపడుతున్నారు. ఇది, వాళ్ల మానసిక ఆరోగ్యానికి చేటు చేస్తోంది.
ట్రంప్ 2.0 పరిపాలనలో H-1B వీసా విధానాలే కాదు, గ్రీన్ కార్డ్ విధానాలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం, దాదాపు పది లక్షల మందికి పైగా భారతీయులు US గ్రీన్ కార్డ్ కోసం సుదీర్ఘ క్యూలో ఎదురు చూస్తున్నారు. వీళ్లలో చాలా మంది టెక్కీలు దశాబ్ద కాలంగా వెయిట్ చేస్తున్నారు. విచిత్రంగా, ఇప్పటికే గ్రీన్ కార్డ్ పొందిన వాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రీన్ కార్డ్ ఉండటం కూడా పెద్ద విషయం కాదని అంటున్నారు.
కాస్త ఊరట
కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్న ప్రకారం... USకి అన్ని రంగాల్లో, ముఖ్యంగా IT డొమైన్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం. కాబట్టి, విదేశీ ఐటీ నిపుణులను ఇప్పటికిప్పుడు బయటకు పంపే అవకాశం రాకపోవచ్చు.
H-1B వీసాలు, గ్రీన్ కార్డ్‌లతో పాటు USలో పనిచేస్తున్న విదేశీ పౌరులపై కొత్త ప్రభుత్వ వైఖరిపై మరింత స్పష్టత కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. జనవరి 20వ తేదీ తర్వాత ట్రంప్ పిక్చర్ మరింత క్లియర్‌గా కనిపిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ట్రంప్ విధానాలతో లాభపడే, బాధపడే రంగాలు ఇవే - మీ పెట్టుబడులు ఉన్నాయా?