LPG Price Hike : సామాన్యుడికి గ్యాస్ గుదిబండలా మారింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుదల రూపంలో మరో భారం సామాన్యుడి నెత్తినపడింది. గృహావసరాలకు ఉపయోగించి 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. గ్యాస్‌ బండ ధరను చమురు సంస్థలు రూ.3.50 పెంచాయి. అలాగే వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.8 పెంచాయి. ఇప్పటికే నిత్యావసరాలు, ఇంధన ధరల భారాన్ని మోస్తున్న సామాన్యులపై గ్యాస్ ధర పెరుగుదలతో మరింత భారం పడనుంది. 


సామాన్యుడి జేబుకు చిల్లు


గ్యాస్ ధరలు ఎండల కన్నా మండిపోతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే, ఇప్పుడు వాటికి గ్యాస్ కూడా తోడైంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుడి జేబుకు చిల్లుపడింది. ధరలు పెరుగుతున్న తీరుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే కాస్త సంపాదన వీటికేపోతే బతుకు బండి ఎలా సాగుతున్నదని ఆవేదన చెందుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు గ్యాస్‌ సిలిండర్‌ మీద రూ.185 పెరిగింది. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1100లకు చేరువలోకి వచ్చింది. ధరల నియంత్రణలో కేంద్ర విఫలమైందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. గతేడాది జులై 2021లో గ్యాస్ ధర రూ.887 ఉండేది. ఇప్పుడు రూ.1,100కి చేరడంతో పేదలు గ్యాస్‌ కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. కూలిపనులు చేసుకునే సామాన్యులు, చిరువ్యాపారుల జేబులు ఖాళీ అవుతున్నాయి. 


ఈ నెలలో రెండోసారి 


గృహావసర, వాణిజ్య LPG సిలిండర్ల ధరలు గురువారం (మే 19) మరోసారి పెరిగాయి. వంటగ్యాస్‌ ధరలు పెంచడం నెల రోజుల్లో ఇది రెండోసారి. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.3.50 పెంచగా, 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.8 చొప్పున పెంచారు. దీంతో దిల్లీ, ముంబయిలలో 14 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1003గా ఉంది. నేటి నుంచి కోల్‌కతాలో దీని ధర రూ.1029, చెన్నైలో రూ.1018.5. ఉంది. 19 కిలోల వాణిజ్య గ్యాస్ ఇప్పుడు దిల్లీలో రూ.2354, కోల్‌కతాలో రూ.2454, ముంబయిలో రూ.2306, చెన్నైలో రూ.2507గా ఉంది. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య LPG సిలిండర్ల ధరలను రూ. 50 పెంచారు. మే 7న తాజా సవరణతో డొమెస్టిక్ LPG సిలిండర్లు దిల్లీలో రూ.999.50కి రిటైల్ గా అమ్ముతున్నారు. మే 1న, 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 102.50 పెరిగి, రూ.2355.50కు చేరింది. అంతకుముందు రూ.2253కి ఉండేది. అలాగే 5 కిలోల ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను రూ.655కి పెంచారు.