DCX Systems Shares: ఇవాళ (నవంబర్ 11, 2022 శుక్రవారం‌), DCX సిస్టమ్స్ షేర్లు స్టాక్ మార్కెట్‌లోకి ఘనంగా అరంగేట్రం చేశాయి. లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసం ఎదురు చూసిన IPO ఇన్వెస్టర్లకు మంచి రాబడిని పువ్వుల్లో పెట్టి అందించాయి.


40% లిస్టింగ్‌ గెయిన్స్‌
నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో (NSE‌) ఒక్కో షేరు రూ. 289.80 ధర వద్ద లిస్ట్‌ అయింది. ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ‍(IPO) ఇష్యూ ప్రైస్‌ రూ. 207 కంటే ఇది 40 శాతం ఎక్కువ. లిస్టింగ్‌ గెయిన్స్‌ కోసమే ఈ IPOను సబ్‌స్ర్కైబ్‌ చేసుకున్న వాళ్లకు ఇవాళ పండగే.


బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో (BSE) ట్రేడింగ్‌లోనూ ఒక్కో షేరు రూ. 289.10 ధర ప్రారంభమైంది. ఇక్కడ కూడా 39 శాతం లిస్టింగ్ గెయిన్స్‌ ఇన్వెస్టర్లకు అందాయి.


DCX Systems వ్యాపారం
బెంగళూరు కేంద్రంగా DCX Systems బిజినెస్‌ చేస్తోంది. రక్షణ రంగానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సబ్-సిస్టమ్స్, కేబుల్ హార్నెస్‌లను తయారు చేస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో ఉత్పాదక సామర్థ్యం & ఆదాయం పరంగా ప్రముఖ ప్లేయర్లలో ఈ కంపెనీ కూడా ఒకటి.


DCX Systems ఆదాయం
2019-20 ఆర్థిక సంవత్సరంలో DCX Systems ఆదాయం రూ. 449 కోట్లుగా ఉండగా... 56.64 శాతం CAGR వద్ద పెరిగి, గత ఆర్థిక సంవత్సరంలో (2021-22) రూ. 1,102 కోట్లుగా నమోదైంది. ఆర్డరు బుక్‌ 2020 మార్చి నాటికి రూ. 1,941 కోట్లుగా ఉండగా, 2022 మార్చి నాటికి రూ. 2,369 కోట్లకు చేరింది.


2022 అక్టోబరు 31న ఓపెన్‌ అయిన ఈ కంపెనీ IPO సబ్‌స్క్రిప్షన్, నవంబర్‌ 02 తేదీన ముగిసింది. ఈ ఇష్యూకి బలమైన రెస్పాన్స్‌ రావడంతో, 69.79 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇష్యూలో 75 శాతాన్ని క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు (క్యూఐఐ), 15 శాతాన్ని సంస్థాగతయేతర పెట్టుబడిదార్లకు, 10 శాతాన్ని రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు.


ఒక్కో షేరును రూ. 197-207 పరిధిలో విక్రయించి, రూ. 400 కోట్లను ఈ కంపెనీ సమీకరించింది. ఇందులో... కంపెనీ ప్రమోటర్లు (NCBG హోల్డింగ్స్, VNG టెక్నాలజీ) కలిసి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (OFS) రూట్‌లో దాదాపు రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.