Online Fraud: భారతదేశంలో డిజిటలైజేషన్ చాలా వేగంగా పెరిగింది, దాంతో పాటే ఆన్‌లైన్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్‌ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రజల్లో అవగాహన పెంచుతున్నా.. కేటుగాళ్లు కొత్త దారులు సృష్టించి మరీ రెచ్చిపోతున్నారు. ఇదే తరహాలో, గ్యాస్ బిల్లు చెల్లింపు పేరుతో పుణెలో ఓ వ్యక్తి నుంచి 16 లక్షల రూపాయలకు పైగా దోచుకున్నారు. మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్‌లో (MGNL) ఉద్యోగిగా నటిస్తూ డబ్బు కాజేశారు.


గ్యాస్ బిల్లు పేరుతో మోసం
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఆన్‌లైన్ మోసానికి పాల్పడిన వ్యక్తి MNGL ఉద్యోగి రాహుల్ శర్మగా నటిస్తూ వృద్ధుడికి ఫోన్ చేశాడు. 514 రూపాయల గ్యాస్ బిల్లు పెండింగ్‌లో ఉందని చెప్పాడు. ఆ డబ్బు వెంటనే చెల్లించకపోతే కనెక్షన్‌ తీసేస్తారని చెప్పాడు. అతని మాటలు నమ్మిన వృద్ధుడు, బిల్లు చెల్లించడానికి కొంత సమయం కావాలని కోరాడు. అయితే, అవతలి వ్యక్తి అందుకు తిరస్కరించాడు. బిల్లు వెంటనే చెల్లించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ భయపెట్టాడు. తాను ఒక లింక్‌ పంపుతానని, ఆ లింక్‌ మీద క్లిక్‌ చేసి డబ్బు చెల్లించాలని సూచించాడు. ఇందుకోసం డెబిట్‌ కార్డ్ ఉపయోగిస్తే సరిపోతుందని అన్నాడు. ఆ వృద్ధుడు స్కామర్‌ మాటలు నమ్మాడు. అతను చెప్పినట్లే లింక్‌ మీద క్లిక్‌ చేసి తన డెబిట్ కార్డు వివరాలను అందులో పూరించాడు. హమ్మయ్య, గ్యాస్‌ బిల్‌ కట్టేశాను అనుకుంటున్న సమయంలో వరుస బెట్టి మరికొన్ని SMSలు వచ్చాయి. 


16 లక్షల రూపాయలకు పైగా మోసం
ఆ వృద్ధుడు తన డెబిట్‌ కార్డును వినియోగించిన వెంటనే అతనికి కొన్ని సందేశాలు వచ్చాయి. మొత్తం 16,22,310 వ్యక్తిగత రుణాన్ని అతని పేరు మీద బ్యాంకు ఆమోదించినట్లు ఆ సందేశాల్లో ఉంది. దీంతో పాటు, ఆ రుణ ఖాతా నుంచి మొత్తం 7,21,845 రూపాయలు కూడా విత్‌డ్రా అయింది. అపరిచితుడు పంపిన లింక్‌ను క్లిక్‌ చేసి తాను మోసపోయానని ఆ వృద్ధుడికి అర్ధం అయింది. వెంటనే ఆ వ్యక్తి పుణెలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆన్‌లైన్ మోసంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా, లింక్‌ల మీద క్లిక్‌ చేసి డబ్బు చెల్లించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలి. ఏ గ్యాస్ కంపెనీ కూడా ఫోన్ చేసి బిల్లు చెల్లించమని అడగదని గుర్తుంచుకోండి. అంతేకాదు, మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు, డెబిట్‌ కార్డ్ విషయాలను అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దు. ఒకవేళ ఆన్‌లైన్‌ మోసానికి గురైతే, వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్‌ అధికారికి కూడా విషయం చెప్పండి. మీరు ఎంత త్వరగా స్పందిస్తే, పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: వెండి రేటు రూ.లక్ష దాటొచ్చు, ఆశ్చర్యపోకండి, సిల్వర్‌ స్పీడ్‌ అలాగే ఉంది!