Mobile Number Blocked: దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో సిమ్ కార్డులు బ్లాక్ అయ్యే దశలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే, ఒక్కో రాష్ట్రంలో లక్షల కొద్దీ సిమ్‌ కార్డ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉంది. వాటిలో మీ పేరిట ఉన్న సిమ్ లేదా మొబైల్‌ నంబర్‌ కూడా ఉండవచ్చు, ఓసారి చెక్‌ చేసుకుంటే మంచిది.


వాస్తవానికి, ఓ వ్యక్తి పేరిట 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే, ఎక్కువగా వ్యక్తుల సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మీకు 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే, టెలికాం డిపార్ట్‌మెంట్‌ బ్లాక్‌ చేయబోయే మొబైల్‌ నంబర్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నంబర్‌లు మీవే కావచ్చు. ఇప్పుడు మీ దగ్గర 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డ్‌లు లేకపోయినప్పటికీ, గతంలో మీ పేరిట జారీ అయి & ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్న సిమ్‌లు లెక్కలోకి వస్తాయి. అంటే, మీరు ప్రస్తుతం వినియోగిస్తున్న సిమ్‌లు + గతంలో మీ పేరిట తీసుకుని ఇప్పటికీ యాక్టివ్‌గా ఉన్న సిమ్‌ల సంఖ్య కలిసి 9 దాటితే, రద్దయ్యే సిమ్‌ కార్డ్‌ల లిస్ట్‌లో మీ పేరిట ఉన్న మొబైల్‌ నంబర్లు కూడా ఉంటాయి.


ఈ పని చేయకపోతే మీ సిమ్ బ్లాక్ అవుతుంది
టెలికాం చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పేరిట 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే, అదనపు సిమ్‌ కార్డ్‌లను రద్దు చేస్తారు. ఈ పని కోసం, తమ పేరిట 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డ్‌లు ఉన్నవారికి 90 రోజుల సమయం ఇచ్చారు. ఈ 90 రోజుల లోపు, వాళ్లు ఏ 9 నంబర్‌లను యాక్టివ్‌గా ఉంచాలనుకుంటున్నారో టెలికాం డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వాలి. వాటిని కొనసాగించి, మిగిలిన సిమ్‌ కార్డ్‌లను డిపార్ట్‌మెంట్‌ రద్దు చేస్తుంది. ఒకవేళ, ఏ వ్యక్తి అయినా ఈ 90 రోజుల లోపు టెలికాం డిపార్ట్‌మెంట్‌కుకు ఎలాంటి సమాచారం అందించకపోతే, డిపార్ట్‌మెంట్ ర్యాండమ్‌గా 9 నంబర్లను ఉంచి మిగిలిన సిమ్ కార్డులను బ్లాక్ చేస్తుంది. మన దేశంలో ఒకే వ్యక్తి పేరిట వందలు, వేల సంఖ్యలో సిమ్ కార్డులు ఉన్న ఉదంతాలు కూడా బయటపడ్డాయి.


సిమ్‌ కార్డ్‌లను ఎందుకు బ్లాక్‌ చేస్తున్నారు?
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాల కేసులను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది. నిజానికి, గతంలో, సిమ్ కార్డ్‌లు పొందడానికి ఎలాంటి పరిమితి లేదు. ఒక వ్యక్తి తన ఇష్టానుసారం ఎన్ని సిమ్ కార్డులనైనా తీసుకోవచ్చు. దీనిని ఉపయోగించుకుని, మోసగాళ్లు & ఉగ్రవాదుల వంటి సంఘ వ్యతిరేక శక్తులు పేట్రేగిపోయాయి. అమాయక ప్రజల ఆధార్‌ నంబర్లు, ఇతర సమాచారం సేకరించి & వాళ్లకు తెలీకుండానే వాళ్ల పేరిట వేల సంఖ్యలో సిమ్‌లు కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన సిమ్‌ కార్డ్‌లను సైబర్‌ మోసాలు & ఉగ్రవాద చర్యలు వంటి ప్రమాదకర పనుల కోసం ఉపయోగించారు. ఒకవేళ ఆ నంబర్లను అధికార్లు ట్రేస్‌ చేసినా, నేరస్తులు కాకుండా అమాయక ప్రజలు పోలీసులకు చిక్కుతున్నారు. ఈ పరిస్థితులను నివారించడానికి, కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తి పేరిట ఉండే సిమ్‌ కార్డ్‌ల సంఖ్యను 9కి పరిమితం చేసింది. ఏ కస్టమర్ పేరిట కూడా 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉండకూడదు. 


9 సిమ్‌ కార్డ్‌లపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల గురించి, టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయి.


మరో ఆసక్తికర కథనం: గురువారం లోక్‌సభలోకి కొత్త ఆదాయ పన్ను బిల్లు! - చట్టం వచ్చాక మారే విషయాలు ఇవీ