Changes In New Income Tax Bill 2025: కేంద్ర ప్రభుత్వం, రేపు (గురువారం, 13 ఫిబ్రవరి 2024) పార్లమెంటులో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టవచ్చు. మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఫిబ్రవరి 07, 2025న ఆమోదించింది. ఈ కొత్త చట్టం, ఆరు దశాబ్దాల నాటి ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఇది, ప్రస్తుతం ఉన్న పన్ను వ్యవస్థను సరళంగా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు అవుతుందని భావిస్తున్నారు. 2025 ఫిబ్రవరి 01న, కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కొత్త బిల్లు గురించి దేశ ప్రజలకు వెల్లడించారు.
కొత్త ఆదాయ పన్ను బిల్లు ఎలాంటి మార్పులు తెస్తుంది?
ఈ కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రధాన లక్ష్యం దేశంలోని ఆదాయ పన్ను వ్యవస్థను మరింత సులభంగా, పూర్తి పారదర్శకంగా, సౌకర్యవంతంగా మార్చడం. చట్టంలోని అంశాలను సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యే రీతిలో ఇది ఉంటుంది, టాక్స్ రూల్స్‌ను పాటించడంలో సౌలభ్యం తీసుకొస్తుంది.
కొత్త ఆదాయ పన్ను బిల్లులో ఆశిస్తున్న ప్రధాన సంస్కరణలు (Major reforms expected in the new Income Tax Bill 2025):
* పన్ను నియమాలు సరళీకరణ - సంక్లిష్టమైన పన్ను నియమాలను తొలగించడం ద్వారా కొత్త వ్యవస్థను సులభంగా మారుస్తారు.
* మినహాయింపులు & తగ్గింపులలో మార్పులు - పన్ను ఆదా కోసం అందుబాటులో ఉన్న మినహాయింపులు & తగ్గింపులు హేతుబద్ధీకరణ.
* సమ్మతిలో మెరుగుదల - ఆదాయ పన్ను పత్రాల దాఖలు & ఇతర ప్రక్రియల్లో సౌలభ్యం.
* వివాద పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడం - పన్ను సంబంధిత వివాదాలకు త్వరిత పరిష్కారం కోసం ఒక కొత్త వ్యవస్థను అమలు చేస్తారు.
* డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిబంధనలు - ఆన్‌లైన్ లావాదేవీలు & డిజిటల్ వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త నియమాలు జోడిస్తారు.
పాత చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం (Income Tax Act, 1961) 60 సంవత్సరాలకు పైగా పాతది & కాలక్రమేణా మరింత సంక్లిష్టంగా మారింది. దీనివల్ల సామాన్య ప్రజలు. సంస్థలు పన్ను నియమాలను అర్థం చేసుకోవడం & అమలు చేయడం కష్టంగా ఉంది. కొత్త బిల్లు ఈ లోపాలను పరిష్కరిస్తుంది & భారతదేశ పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా చేస్తుంది.
పన్ను శ్లాబుల్లో కొత్త మార్పులు
2025 బడ్జెట్ సందర్భంగా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కొత్త ఆదాయ పన్ను విధానం (New Income Tax Gegime) కింద, కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు.
కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం:
రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను లేదు
రూ. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు - 15% పన్ను
రూ. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు - 20% పన్ను
రూ. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు - 25% పన్ను
రూ. 24 లక్షలకు పైగా ఆదాయం – 30% పన్ను
ఒకవేళ, ఒక వ్యక్తి ఏడాది సంపాదన రూ. 12 లక్షలకు మించితే శ్లాబ్‌లు ఇలా వర్తిస్తాయి.
రూ. 4 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
రూ. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు - 5% పన్ను
రూ. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు - 10% పన్ను
రూ. 12 లక్షల నుంచి 16 లక్షల వరకు - 15% పన్ను
రూ. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు - 20% పన్ను
రూ. 20 లక్షల నుంచి 24 లక్షల వరకు - 25% పన్ను
రూ. 24 లక్షలకు పైగా ఆదాయం – 30% పన్ను
ఉద్యోగులు (ప్రభుత్వ & ప్రైవేట్), పింఛనుదార్లు అదనంగా రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే, వీళ్లు రూ. 12,75,000 వరకు వార్షిక ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు, పింఛనుదార్లు కాకుండా ఇతర వర్గాలకు స్టాండర్డ్ డిడక్షన్ వర్తించదు.
కొత్త పన్ను శ్లాబ్‌లు 01 ఏప్రిల్ 2025 నుంచి సంపాదించే ఆదాయానికి వర్తిస్తాయి. అంటే, 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో పన్ను లేని వార్షిక ఆదాయ పరిమితి రూ.7 లక్షలుగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: ఆదాయం పెరిగింది, ఐటీఆర్‌లు పెరిగాయ్ - టాక్స్‌పేయర్ల సంఖ్య తగ్గింది, ఇదేం విచిత్రం