బూస్టర్‌ డోస్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే కొవిడ్‌ వ్యాక్సిన్ల ధరలు తగ్గిపోయాయి! ఇక నుంచి కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా ధరలు రూ.225కు తగ్గించారు. కొవిషీల్డ్‌ రూ.600, కొవాగ్జిన్‌ రూ.1200 నుంచి రూ.225కే ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి.






కేంద్ర ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించిన తర్వాత వ్యాక్సిన్ ధరలు తగ్గిస్తున్నామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా, భారత్‌ బయోటెక్‌ కోఫౌండర్‌ సుచిత్ర ఎల్లా ట్వీట్‌ చేశారు. 18 ఏళ్లు నిండిన అందరి కోసం బూస్టర్‌ డోసులు ఆదివారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.


కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేయించుకొని 9 నెలలు పూర్తిచేసుకున్న 18+ వయస్కులకు కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ వేసుకొనేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారమే అనుమతి ఇచ్చింది. వెంటనే సీరమ్‌ సీఈవో పూనావాలా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 'బూస్టర్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వ నిర్ణయం ఎంతో బాగుంది. ఈ నిర్ణయంతో ప్రజలకు దీర్ఘకాల రక్షణ లభిస్తుంది. ప్రయాణాలు చేయడం సులభతరం అవుతుంది' అని ఆయన అన్నారు. ఇప్పటికే తమ వద్ద 200 మిలియన్‌ డోసుల స్టాక్‌ ఉండటంతో తొమ్మిది నెలల అంతరం అవసరం లేదని అంటున్నారు. సీరమ్‌ 4 బిలియన్‌ డోసులు ఉత్పత్తి చేయగలదని పేర్కొన్నారు.