LPG Cylinder Price Hike: న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో చమురు ధరలతో పాటు నేచురల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో చమురు సంస్థలు భారత్‌లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మరోసారి భారీగా పెంచాయి. పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమలులోకి వచ్చాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 195 పెంచుతూ చమరు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 

ఇప్పుడు ఢిల్లీలో సిలిండర్ రూ. 195, ముంబైలో రూ. 196, చెన్నైలో రూ. 203, కోల్‌కతాలో రూ. 218 మేర పెరిగింది. అయితే, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలిగించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు చేయలేదు.

పెరిగిన తర్వాత కొత్త ధరలు

తాజా పెరిగిన ధరల తరువాత ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 2078.50కు చేరింది. గతంలో రూ. 1884.50 గా ఉండే ధర 2 వేల మార్క్ దాటింది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర రూ.2300 అయింది. హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965గా ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఏ మార్పులు చేయలేదు. చెన్నైలో కమర్షియల్ సిలిండర్ రూ. 2246.50 కి లభిస్తుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ. 2031 కి చేరుకుంది. కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ఇప్పుడు రూ. 2208 కు చేరింది. పాట్నాలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రేటు రూ. 2365 కాగా, జైపూర్‌లో దీని ధర రూ. 2031 అయింది.

ఇటీవల పెరిగిన ధరలు

ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో మార్చి 7న కూడా డొమెస్టిక్, కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచారు. ఆ సమయంలో ఇంట్లోకి వినియోగించే ఎల్పీజీ సిలిండర్ రూ. 60, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ. 114.50 మేర పెంచారు. ఆ పెంపు తర్వాత ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 913 అయింది. అంతకుముందు రూ. 853 గా ఉండేది. ఈ ఏడాది సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 2025లో కూడా రూ. 50 పెంచారు.

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరకేవలం మూడు వారాల వ్యవధిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండోసారి భారీగా పెరిగింది. హోటల్స్, రెస్టారెంట్స్ లాంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.195 పెంచినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. నేటి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గృహావసరాలకు వినియోగించే 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు యథాతథంగా ఉంచడం సామాన్యులకు ఊరట కలిగిస్తోంది.